ఢీసీసీబీ | - | Sakshi
Sakshi News home page

ఢీసీసీబీ

May 9 2025 2:06 AM | Updated on May 9 2025 2:11 AM

ఢీసీస

ఢీసీసీబీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ పదవి పచ్చనేతల మధ్య చిచ్చు పెట్టింది. కూటమి సర్కారు ఆ పదవిని ఓ నేతకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసినా.. ఆ కుర్చీని ఆశిస్తున్న ఆశావహులు కేటాయింపు చెల్లదని.. దాన్ని రద్దు చేసి, తమకే ఇవ్వాలని ఓ సీనియర్‌ నేత వర్గం పట్టుపడుతోంది. దీంతో డీసీసీబీ కుర్చీకి కుమ్ములాట జరుగుతోంది.

డీసీసీబీ కార్యాలయం

చితూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌ పదవి కేటాయింపు జరిగినా ఆ కుర్చీపై తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అని కుమ్ములాడుతున్నారు. దీంతో పదవి దక్కించుకున్న అమాసకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆ పేరును కూటమి ప్రభుత్వం ప్రకటించినా.. సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రిని నిలదీశారు. చైర్మన్‌ పదవిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ ఆశించినా..

డీసీసీబీ పదవిని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆశించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో డీసీసీబీ చైర్మన్‌ పదవి దొరబాబుకే వస్తుందని అందరూ ఊహించారు. ఆయన అనుచరులతోపాటు, డీసీసీబీ అధికార వర్గం సైతం చైర్మన్‌ కుర్చీ దొరబాబుకేనని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు కాకుండా ఎవరూ ఊహించని విధంగా అమాసకు చైర్మన్‌ పదవి కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది.

మళ్లీ అమాసకే...

కూటమి ప్రభుత్వం గతనెల 28వ తేదీన అమాస రాజశేఖర్‌రెడ్డికి డీసీసీబీ పదవిని కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 నుంచి 2019 మధ్యకాలంలో పలుమార్లు ఈయనే చైర్మన్‌ కుర్చీలో కూర్చున్నారు. 13 ఏళ్ల పాటు డీసీసీబీ పదవిని అనుభవించారు. మళ్లీ ఈ పదవిని అమాసకు కట్టబెట్టేందుకు కూటమి నేతలు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్‌ చక్రం తిప్పారనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో బ్యాంకు తరఫు రూ.కోటి చెక్కును అందించిన విషయం, కుప్పంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు బ్యాంకు నిధులు కేటాయింపు అమాసకు కలిసొచ్చిందని కొందరు సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పదవి కాలంలో అవసరం లేని భవన నిర్మాణం, వాస్తు దోషం పేరుతో గుడి నిర్మించిన ఘనత, రైతుల ధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణలను మళ్లీ వారు వేలెత్తి చూపుతున్నారు.

అమాసకు ఎలా ఇస్తారు?

అమాసకు మళ్లీ డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టడంపై కూటమిలో కుమ్ములాట మొదలైంది. ఆశావాహులు, సీనియర్‌ నేతలు ఈ పదవి కేటాయింపుపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం డీఆర్‌సీ మీటింగ్‌కు హాజరైనా జిల్లా రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ అమాసకు ఎలా పదవి ఇస్తారంటూ నిలదీశారు. పార్టీకి కష్టపడిన వారికి ఇవ్వకుండా మళ్లీ అమాసకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. చైర్మన్‌ పదవిని మార్చాలని భీష్మించారు. సీనియర్లకు ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారికి పదువులు ఇవ్వడం విడ్డూరమంటూ విరుచుపడ్డారు. దీంతో మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకెళతానని వాళ్ల మధ్య నుంచి తప్పుకున్నారు.

డీసీసీబీగా చైర్మన్‌ పదవి అమాస రాజశేఖర్‌రెడ్డికి కేటాయింపు జీర్ణించుకోలేని తమ్ముళ్లు

మంత్రిని నిలదీసిన మాజీ ఎమ్మెల్సీ, పలువురు నేతలు

పార్టీలోని సీనియర్లకు ఇవ్వాలి డిమాండ్‌

చైర్మన్‌ ప్రమాణస్వీకారం వేళ..

డీసీసీబీ చైర్మన్‌ పదవి అమాసకు కేటాయించి, వారం రోజులు దాటింది. దీంతో చైర్మన్‌ పగ్గాలు చేపట్టేందుకు అమాస సిద్ధమవుతున్నారు. కార్యాలయానికి రంగులు వేయిస్తున్నారు. ఆయన చాంబర్‌కు కొత్త హంగులు దిద్దించుకుంటున్నారు. త్వరలో ప్రమాణాస్వీకారానికి ముహుర్తం ఖరారు చేయనున్నారు. ఈ తరుణంలో చైర్మన్‌ పదవిపై పేచీ పెట్టేందుకు కొందరు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. అమాసకు ఆ పదవి లేకుండా చేయాలని కొందరు బహిరంగంగా పట్టుబడడంతో అమాస వర్గం మల్లగుల్లలు పడుతోంది. ముహుర్తానికి ముందే మార్పునకు చూడాలని ఓ సీనియర్‌ నేత గట్టిగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు.

ఢీసీసీబీ1
1/2

ఢీసీసీబీ

ఢీసీసీబీ2
2/2

ఢీసీసీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement