పుంగనూరుకెందుకన్ని నిధులు? | - | Sakshi
Sakshi News home page

పుంగనూరుకెందుకన్ని నిధులు?

May 7 2025 1:03 AM | Updated on May 7 2025 1:03 AM

పుంగన

పుంగనూరుకెందుకన్ని నిధులు?

● కూటమి ప్రజాప్రతినిధుల అక్కసు ● ఆ నియోజకవర్గానికి నిధులు తగ్గించాలని హుకుం ● కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం ● పాల్గొన్న ఇన్‌చార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి ప్రజాప్రతినిధులు పుంగనూరు నియోజకవర్గంపై అక్కసు చూపించారు. ఆ నియోజకవర్గానికి ఎందుకు అన్ని నిధులు ఎక్కువ ఇచ్చారు.. ఇకపై ఆ నియోజకవర్గానికి తగ్గించండి అని టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అధికారు లకు హుకుం జారీ చేశారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మధ్యాహ్నం 1.15 గంటలకే తూతూమంత్రంగా మమ అనిపించేశారు. ఈ సమీక్షలో 15 శాఖల్లోని అంశాలను చర్చించాల్సి ఉండగా.. 8 శాఖల్లో అంశాలపై తూతూమంత్రంగా చర్చించి చేతులు దులుపుకున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో ఇన్‌చార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్‌, మురళీమోహన్‌, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఎఫ్‌ఓ భరణి, ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పాడల్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు.

హైవేలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేయాలి

జిల్లాలోని జగమర్ల–ఐతేపల్లి రోడ్డులో గత సంవత్సర కాలంలో ప్రమాదాలు జరిగి 600 మృతి చెందారని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ అన్నారు. చిత్తూరు తిరుపతి బెంగళూరు హైవేల్లో నిత్యం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పి.కొత్తకోటకు సమీపంలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు.

తాగునీటి సమస్యలకు అధిక నిధులు

జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో కేటాయించిన నిధులను అధికంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడించారు. జిల్లాలో మామిడి దిగుబడి అధికంగా ఉన్నందున పల్ప్‌ను టీటీడీ భక్తులకు అందజేసేలా ప్రజా ప్రతినిధుల సహకారంతో టీటీడీ ఆమోదం పొందితే మేలు జరుగుతుందన్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీన కురిసిన వర్షానికి జరిగిన పంట నష్టం పరిహారం అందించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

నిధులెందుకు మురగబెడుతున్నారు?

అసలే నిధుల సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ నిధులున్నా ఎందుకు మురగపెడుతున్నారంటూ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు వైద్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక శాతం నిధులు ఖర్చు చేయకుండా అలాగే ఉంచితే తర్వాత నిధులు ఎలా వస్తాయంటూ చురకలంటించారు.

అధికారిక సమావేశంలో స్టేజీపై టీడీపీ నేత

జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం అధికారికంగా కలెక్టరేట్‌లో చేపట్టగా ఈ సమావేశంలో టీడీపీ నేత స్టేజీ తిష్టవేశారు. ఎలాంటి హోదా లేని పుంగనూరు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి దర్జాగా స్టేజీపై కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారిక సమావేశంలో హోదా లేని ఆ టీడీపీ నేత ఎలా పాల్గొంటారని, గతంలో సైతం అనేక సమావేశాల్లో ఇలానే పాల్గొన్నాడని అధికారులు గుసగుసలాడారు. అదే విధంగా జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొని సమావేశానికి ఇబ్బంది కలిగేలా చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.

విచారణ చేసి నివేదికలివ్వండి

ఇటీవల ప్రభుత్వ, అపోలో ఆస్పత్రిలో జరిగిన ఓ మహిళ మృతి ఘటనపై సమీక్షలో చర్చించారు. అపోలో ఆస్పత్రిలోని వైద్యుల అలసత్వం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అపోలో ఎంఓయూను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నిబంధనల ప్రకారం అపోలో యాజమాన్యం మందులను కొనుగోలు చేస్తోందా..?లేదా.. పలు అంశాలపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలన్నారు.

గగనంగా మామిడికి గిట్టుబాటు

జిల్లాలో ఎక్కువ మంది మామిడి రైతులున్నారని, అయితే ప్రతిసారీ మామిడికి గిట్టుబాటు ధర కల్పించడం గగనమవుతోందని ఇన్‌చార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధర, ఎగుమతులు, టీటీడీతో ఒప్పందం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని, జిల్లాలో ఉన్నతాధికారులకు ఉన్న చిత్తశుద్ధి క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులకు లేదని మండిపడ్డారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తే ఈరోజుకీ ప్రజలు కలెక్టరేట్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. తప్పెవరిదని రెవెన్యూ ఉద్యోగులు గుండైపె చేయి వేసుకుని పరీక్షించుకోవాలన్నారు.

పుంగనూరుకెందుకన్ని నిధులు?1
1/1

పుంగనూరుకెందుకన్ని నిధులు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement