వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా?
● రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మీరంతా వేరే చోటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా..లేదా? అని ప్రభుత్వ వైద్య బృందాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రశ్నించారు. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సోమవారం ఆయన పరిశీలించారు. తొలుత అత్యవసర విభాగంలో అందుతున్న సేవలు, లోటుపాట్లపై ఆస్పత్రి అధికారులను, అపోలో నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎంఎస్ వార్డులోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయన మీరంతా వేరే చోటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రభుత్వ వైద్యబృందాన్ని ప్రశ్నించారు. ఇందుకు పలువురు... ఎండీయూ ఒప్పందం ప్రకారం 70 శాతం అపోలో, 30 శాతం ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఇక్కడ పనిచేసేలా ఉందని బదులిచ్చారు. ఆ ప్రకారమే పనిచేస్తామని..బదిలీలు, డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలని వారు ఆయన్ని కోరారు.
‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి దినపత్రికలో సోమవారం అరకొర వైద్యం పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు స్పందించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను అడిగే సమయంలో.. స్టాఫ్ నర్సులు 78 మందికి 61 మంది మాత్రమే ఉన్నారా? అని అధికారులను ఆరా తీశారు. ఇందుకు ఏపీజీఎన్‌ఏ అధ్యక్షురాలు రాణి, సభ్యులు హిమబిందు సమాధానమిస్తూ స్టాఫ్‌నర్సు ఖాళీలు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, ఇతరాత్ర పోస్టులు ఖాళీలున్నాయని, దీంతో పనిభారం అధికంగా ఉందని తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు ఇద్దరు డాక్టర్లే ఉన్నామని..కొంత మంది డాక్టర్లు అవసరమవుతోందని పలువురు వైద్యులు కోరారు. డీసీహెచ్‌ఎస్ పరిధిలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్స్, స్టాఫ్‌నర్స్‌లను క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే 15 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయచంద్రకుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఆస్పత్రి అధికారులతో సమీక్ష నిర్వహించగా...ఒప్పందం ప్రకారం ఆస్పత్రి నిర్వహణ జరుగుతోందా? లేదా ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి దేవి, డీఎంఅండ్‌హెచ్ సుధారాణి, అపోలో నిర్వాహకులు నరేష్‌కుమార్‌రెడ్డి, రాంగోపాల్‌రెడ్డి తదితరులున్నారు.
వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా?


