రఘురామా.. ఏమిటయ్యా ఇదీ !
● ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ● చర్యలు చేపట్టని ఉన్నతాధికారులు
పుత్తూరు : పుత్తూరులో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన విధులను పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను భుజానకెత్తుకున్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు పట్టణానికి చెందిన కె.రఘురామ్ కొంత కాలంగా స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ)గా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఈనెల 1వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అవతారం ఎత్తి, పుత్తూరు మున్సిపాలిటీ 10వ వార్డు గోవిందపాళెం గ్రామంలో పింఛన్లను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఫొటోలకు ఫోజులు ఇస్తున్నవి వైరల్ అవుతున్నాయి. ఇంతటితో ఆగకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ భూమిని ఆక్రమించి పక్కా భవనాలు నిర్మించినట్లు ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే సంబంధిత శాఖాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


