● సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు ● వేదికపై కూటమి నేతల బెదిరింపులు
శ్రీరంగరాజపురం : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకుందామని వస్తే అక్కడికి వచ్చిన ప్రజలకు కూటమి నేతల ఓవరాక్షన్, బెదిరింపులతో సమస్యలు చెప్పనీయకుండా అడ్డుకున్నారు. మండలం కేంద్రంలో బుధవారం వెలుగు కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్దామని వచ్చిన ప్రజలకు కొంత మంది కూటమి నేతలు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికలో కూటమి నాయకులే ఉన్నారు తప్ప అధికారులకు వేదికపై చోటు కల్పించకపోవడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే, అధికారులకు సమస్యలను తెలియజేస్తామని వస్తే వేదిక మొత్తం నాయకులే ఉన్నారు తప్ప అధికారులు లేకపోవడంతో ప్రజలు కొంత మంది వెనుదిరిగారు. ఎగువకమ్మకండ్రిగ పంచాయతీ పీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ భార్య సుబ్బలక్ష్మి నా భర్తను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని కూటమి నాయకులు బెదిరిస్తున్నారు అని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని చెప్పడంతో అక్కడే ఉన్న మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, బాలాజీ నాయుడు జోక్యం చేసుకొని నీ భర్త ఉద్యోగం తీసేస్తే ..నీవెందుకు వచ్చావ్ అంటూ ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన వినతి పత్రంపై ఎమ్మెల్యే రాసిన వాటిని సైతం కొట్టివేశారు. ఎమ్మెల్యేకు సమస్యలను తెలియజేయడానికి వస్తే మీ ఓవరాక్షన్ ఏంటి అని అక్కడి వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వేదిక మొత్తం కూటమి నాయకులే ఉన్నారే తప్ప అధికారులు లేకపోవడం గమనార్హం.


