
గంగ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
● రేపటి నుంచి జాతర ఉత్సవాలు ● 400 మంది పోలీసులతో బందోబస్తు ● పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ వెల్లడి
పుంగనూరు : ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారులతో సమన్వయం చేసుకున్నామని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో సీఐలు, పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతర జరిగే ప్యాలెస్ ఆవరణం , ప్యాలెస్‌లో జమీందారులు సోమశేఖర్ చిక్కరాయల్, మల్లికార్జున చిక్కరాయల్‌తో సమావేశమై జాతర ఏర్పాట్లు గురించి చర్చించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు , సిబ్బంది 400 మందిని జాతర బందోబస్తుకు నియమించామన్నారు. 25న మంగళవారం రాత్రి అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమై 26న బుధవారం వేకువజాము నుంచి అమ్మవారిని ప్రజల దర్శనార్థం ప్యాలెస్‌లో ఉంచుతారని తెలిపారు. అదే రోజు రాత్రి అమ్మవారి నిమజ్జనం ఉంటుందని తెలిపారు.
శాంతి కమిటీ ఏర్పాటు
జాతరలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. అనుమానితులు , జేబు దొంగలను ముందుగానే అదుపులోకి తీసుకునేలా ఐడీ పార్టీ బృందాలను నియమించామన్నారు. జాతరకు వేల మంది రానున్న కారణంగా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని , ఇందుకోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జాతరను జయప్రదం చేసేందుకు అన్ని వర్గాలతో కలిపి శాంతి కమిటీని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌బీ సీఐ భాస్కర్, సీఐలు రామ్‌భూపాల్, ఉమామహేశ్వర్‌రావు, ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, ఎస్‌ఐ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
పట్టణ సమీపంలోని అరబిక్ కళాశాల నుంచి బస్సులు, లారీలు , కార్లు బైపాస్‌రోడ్డు నుంచి చదళ్ల క్రాస్‌కు మళ్లిస్తున్నామన్నారు. అలాగే పట్టణంలోని సెంటర్‌లాడ్జి, తూర్పుమొగశాల, నగిరివీధి, బ్రాహ్మణవీధి, కట్ట కిందపాళ్యెం ప్రాంతాలలో కార్లు , ద్విచక్రవాహనాలు పూర్తిగా నిషేధిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో అనుమతిస్తామన్నారు. పార్కింగ్ కోసం చెరువు కట్టపైన , ఆర్టీసీ డిపో , ఎన్‌ఎస్ పేట, బీఎంఎస్ క్లబ్ ప్రాంతాలలో స్థలం ఏర్పాటు చేశారు.

గంగ జాతరకు పటిష్ట ఏర్పాట్లు