నకిలీ వి‘ప’త్తు!
నకిలీ విత్తనాలతో మోసపోతున్న రైతులు నకిలీ నారును అంటగడుతున్న కొంత మంది నిర్వాహకులు
చౌడేపల్లె: పడమటి మండలాల రైతులు టమాట సాగుపై దృష్టి సారించారు. నారుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నర్సరీ నిర్వాహకులు నకిలీ నారును అంటగడుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో దశలవారీగా టమాట పంటను సాగుచేయనున్నారు. సీజన్ దగ్గరపడుతుండడంతో పలువురు నర్సరీ నిర్వాహకులు విత్తనాలు విత్తి మొలకల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. తక్కువ నీటి సౌకర్యం ఉన్న రైతు కూడా అధిక దిగుబడులు పొందడానికి మార్కెట్లో వెలువడిన కొత్తరకం విత్తనాలపై ఆశపడుతున్నారు. నర్సరీలో ప్రస్తుతం సాహో, సల్లార్, కావేరి, 778, శివంగితోపాటు పలు కొత్త రకం టమాట మొలకలు లభిస్తున్నాయి.
ముందుగానే రిజర్వేషన్లు
మొలకల కోసం రైతులు ముందుగానే నర్సరీ యజమానుల వద్ద ఒప్పదం కుదుర్చుకుంటున్నారు. ఒక్కొక్క టమాట మొలకను రూ.1.2 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తున్నారు. నారు పెంచేందుకు 27 రోజులు పడుతుందని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఎకరం పొలానికి 7 వేల నుంచి 8 వేల టమాట మొలకలు అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. నకిలీ నారు, నకిలీ విత్తనాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
టమాట నారుకు భలే డిమాండ్
నకిలీల జోరు
టమాట మొలకల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు బయట ప్రాంతం నుంచి నారును సరఫరా చేస్తున్నారు. దీంతో నకిలీ విత్తనాలతో తయా రు చేసిన నారు జోరుగా విక్రయిస్తున్నట్టు రైతులు ఆ రోపిస్తున్నారు. అధికారులకు సమాచారం తెలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.


