చిత్తూరు కలెక్టరేట్ : డీఆర్‌డీఏ కార్యాలయంలో సోమవారం చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల ఏంపీఎలు, సీసీలతో వెదురు పెంపకంపై ఒక్క రోజు వర్క్‌షాపు నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ వెదురు పెంపకంతో అనేక లాభాలున్నాయన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వెదురుకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి భూముల్లోనైనా వెదురు సాగు చేయవచ్చన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చని వెల్లడించారు.సంఘాల్లోని మహిళా రైతులకు వెదురుపెంపకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం కనుమరుగవుతున్న వెదురును ప్రోత్సహించాలని సూచించారు. పోడు భూముల సైతం ఈ పంట సాగుచేయవచ్చని, తద్వారా ఏటా రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇందుకు ఇండస్ట్రీ ఫౌండేషన్ తరపున పూర్తి సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ జేఈ వెంకటరావు, ఇండస్ట్రీ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు అశోక్, కుసుమ, అమృత, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పలువురు తహసీల్దార్ల నియమాకం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు మండలాలకు తహసీల్దార్లను నియమించారు. సోమవారం ఈ మేరకు ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరి ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో ముగ్గురు తహసీల్దార్లను డిప్యూటేషన్ పద్ధతిలో, నలుగురు డీటీలకు తహసీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా రామకుప్పం తహసీల్దార్ బాబును వెదురుకుప్పానికి, విజయపురం తహసీల్దార్ మాధవరాజును గంగవరానికి, పూతలపట్టు తహసీల్దార్ గుర్రప్పను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. శాంతిపురం డీటీ కౌలేష్‌కు రామకుప్పం తహసీల్దార్‌గా, వెదురుకుప్పం డీటీ రమేష్‌బాబుకు పూతలపట్టు, జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయం డీటీ శ్యాంప్రసాద్‌రెడ్డికి బైరెడ్డిపల్లె, కుప్పం ఆర్డీఓ కార్యాలయ డీటీ ప్రసన్నకుమార్‌కు శాంతిపురం తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 57 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 57 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి