కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చిన ఓ భక్తురాలు పొగొట్టుకున్న బంగారు బ్రా స్లెట్‌ను ఆమెకు తిరిగి అప్పగించారు. బంగారుపాళెం మండలం నల్లంగాడు గ్రామానికి చెందిన కీర్తన బుధవారం కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. ఈ క్రమంలో చేతిలోని సుమారు 14 గ్రాములు బ్రాస్లెట్ ఆలయంలో జారి పడిపోయింది. ఇది గమనించిన అటెండర్ వీరముణి ఆ ఆభరణాన్ని తీసుకుని అధికారులకు అప్పగించారు. అనంతరం ఆ ఆభరణం ఎవరిదన్న విషయం ఆరా తీసి, హోంగార్డు వినాయకం, ఆలయ ఏఈఓ రవీంద్రబాబుతో కలిసి బాధితురాలు కీర్తనకు అప్పగించారు.
జెడ్పీ బడ్జెట్ ఆమోదం
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ బడ్జెట్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం జీఓ నెంబర్ 151ను బుధవారం విడుదల చేసింది. 2024–2025కు సంబంధించి అధికారులు పంపిన రివైజ్డ్ బడ్జెట్ పరంగా ఆదాయం రూ.4,133 కోట్లు, వ్యయం రూ.4,039 కోట్లకు అంగీకరం తెలిపింది. ఏడాది చివరిలో జెడ్పీలోని 11 అనుబంధశాఖల పరంగా పెట్టిన ఖర్చు, వ్యయం వివరాల నివేదిక ప్రభుత్వానికి పంపుతారు.
మహిళా అభ్యున్నతికి కృషి
కుప్పం: మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కడా పీడీ వికాస్ మర్మత్ అన్నారు. బుధవారం జైపూర్‌కు చెందిన ప్రైమ్ టైర్ మార్కెట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కంపెనీ యాజమాన్యం కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఆర్థికాభివృద్ధిపై మహిళలకు రెండు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై అవగాహన, డిజిటల్ విధానంలో కొనుగోలు, లావాదేవీలు తదితర అంశాలపై అవగాహన కల్పించి మహిళలకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఈ సంస్థ పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సంస్థ చేపట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకర్షితులై ప్రయోగాత్మకంగా కుప్పంలో ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి దశగా కుప్పం మండలంలో ప్రైమ్‌టైర్ మార్కెటింగ్ సంస్థ వంద మంది మహిళలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్‌టైర్ మార్కెట్ ప్రతినిధులు అజేతాషాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
15 మందిపై కేసులు
పలమనేరు: పట్టణంలో మంగళవారం విద్యార్థులకు సంబంధించిన గొడవలో కొందరు గ్యాంగ్‌లు చేరి, గొడవలకు కారణమై ఆపై పోలీసుల విధులను అడ్డుకున్న సంఘటనలకు సంబంధించి 15 మందిపై కేసు నమోదు చేసినట్టు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ బుధవారం తెలిపారు. కొందరి బైక్‌లను స్వాధీనం చేసుకుని వారిపై దాడి చేయడం, విచారణకు వచ్చిన పోలీసులపై దౌర్జన్యం, కార్ట్ అండ్ సర్చ్‌లో మారణాయుధాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. దీంతో పాటు పట్టణంలోని పలు అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు. మరోవైపు రెండ్రోజుల్లో రౌడీ షీటర్లు, గంజా స్మగర్లు, ఆకతాయిలు, జులాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.


