వెదురుకుప్పం: పొలంలో పనిచేసుకుంటున్న తనపై ఓ వ్యక్తి హోంగార్డు అని చెప్పి మహిళ అని చూడకుండా చితకబాదినట్లు మండలంలోని పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సుగుణ బుధవారం వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. తాను పొలంలో పనిచేసుకుంటుండగా మా ఊరు కాదు మా మండలం కాని ప్రకాష్ అనే వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి, తనపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు. 2012 నుంచి తమ అనుభవంలో ఉన్న భూమిలో పనులు చేసుకుంటుండగా ప్రకాష్ వచ్చి, ఇది తమ భూమి అని చెప్పి బెదిరించాడు. తమ ఊరికొచ్చి తమ పొలం వద్దకు వచ్చి అకారణంగా తమను చంపేస్తామని బెదిరించి కొట్టి గాయపరచినట్లు విలపించింది. మెడలో ఉన్న నల్లపూసల దండ, వేలుకి ఉన్న ఉంగరాన్ని కూడా తీసుకుని వెళ్లిపోయినట్లు తెలిపింది. అరుపులు, కేకలు వేస్తున్నా ఏ మాత్రం కనికరించకుండా అడ్డు వచ్చిన మా అక్క, మా భావపై కూడా దాడికి పాల్పడినట్లు చెప్పింది. దాడికి పాల్పడిన ప్రకాష్ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.


