సీఆర్సీ.. అయ్యోర్లపై కసి | - | Sakshi
Sakshi News home page

సీఆర్సీ.. అయ్యోర్లపై కసి

Mar 12 2025 8:01 AM | Updated on Mar 12 2025 7:56 AM

● అధికారుల అత్యుత్సాహంతో టీచర్లు ఉక్కిరి..బిక్కిరి ● పరీక్షల సమయంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు ● కూటమి టీడీపీపై పెదవి విరుస్తున్న సర్కారు అయ్యోర్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : కూటమి సర్కారు వ్యవహరిస్తు న్న తీరుపై జిల్లాలోని సర్కారు పాఠశాలల ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ వైఖరిపై పెదవి విరుస్తున్నారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆఘమేఘాలపై ఈ నెల 12వ తేదీన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. ఈ సమావేశాల సమయంలో దూరాభారం వెళ్లి సమావేశాలకు హాజరుకావాల్సి వస్తుందని, పరీక్షల సమయంలో ఈ సమావేశాలతో ఉపయోగమేముంటుందని అయ్యోర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారు ల అత్యుత్సాహంతో జిల్లాలోని హైస్కూళ్లలోని హెచ్‌ఎంలు, టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీ స్ట్రక్చరింగ్‌ పేరుతో ఫౌండేషన్‌ స్కూల్స్‌ ఏర్పాటుపై స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను క్లస్టర్‌ సమావేశాల్లో ఒప్పించాలని విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఫౌండేషన్‌ స్కూళ్ల వ్యవహారంపై ఇప్పటికే తల్లిదండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు.

148 క్లస్టర్లలో సమావేశాలు

జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లో 148 క్లస్టర్లలో ఈ నెల 12వ తేదీన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పలువురు టీచర్లు ఇన్విజిలేషన్‌ డ్యూటీ సైతం చేస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష యథావిధిగా నిర్వహించి, మధ్యాహ్నం క్లస్టర్‌ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇన్విజిలేటర్లు సైతం విధులు నిర్వహించిన అనంతరం హాజరుకావాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఈ నెల 12 వ తేదీ సెలవు ప్రకటించాలని డీఈఓ వరలక్ష్మి ఆదేశించారు.

మొదటి సమావేశంలోనే చుక్కలు

ఫిబ్రవరి 15వ తేదీన నిర్వహించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం టీచర్లకు చుక్కులు చూపించింది. నిమిషం ఆలస్యమైనా అటెండెన్స్‌ యాప్‌ను క్లోజ్‌ చేసేశారు. అలాగే సాయంత్రం సమావేశం పూర్తయ్యేవరకు అటెండెన్స్‌ యాప్‌ పనిచేయకుండా ఇబ్బందులు పెట్టారు. బయోమెట్రిక్‌ వేయని టీచర్లకు నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ నెల 12వ తేదీన నిర్వహించే సమావేశంలో టీచర్లను ఇబ్బందులు పెట్టేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. కూటమి టీడీపీ ప్రభుత్వ తీరుపై అయ్యోర్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement