ఇంకెప్పుడు వస్తారు? | - | Sakshi
Sakshi News home page

ఇంకెప్పుడు వస్తారు?

Mar 12 2025 8:01 AM | Updated on Mar 12 2025 7:56 AM

● 5 నెలలవుతున్నా విధుల్లో చేరని ఉద్యోగులు ● చిత్తూరు ఎస్‌ఈ కార్యాలయంపై అనాసక్తి

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా ట్రాన్స్‌కో పరిపాలన గతంలో తిరుపతి కేంద్రంగా జరిగేది. పరిపాలన సౌలభ్యత కోసం 5 నెలలు ముందు చిత్తూరు జిల్లాకు ఎస్‌ఈ కార్యాలయం, అధికారులను కేటాయించారు. అందులో కొందరు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇంక దాదాపు 15 మంది వరకు ఉద్యోగులు రావాల్సి ఉంది. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం వేస్తున్నారు. పలు విభాగాలకు కార్యాలయాలను కేటాయింపులు జరపాల్సి ఉంది. జిల్లా ట్రాన్స్‌కో కార్యాలయంలో పలు విభాగాల ఉద్యోగులు చిత్తూరు రావడానికి సముఖత చూపడం లేదు.

విధుల్లో చేరని ఉద్యోగులు

స్థానిక గిరింపేటలో ఎస్‌ఈ కార్యాలయం కేటాయించి 5 నెలలవుతున్నది. ఎస్‌ఈ అక్టోబర్‌ 13న బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు టెక్నికల్‌ ఈఈ, ఎస్‌ఎఓ, పీఓ, ఎంఆర్‌టీ, నిర్మాణ విభాగం, ఏఏఓ ఇతర అధికారులు విధుల్లోకి వచ్చారు. జిల్లాకు ఎస్‌ఈ 1, ఈఈ 3, డీఈ 6, ఏఈ 12, జేఈ 4, ఎస్‌ఎఓ 1, ఏఏఓ 1, జేఏఓ 5, పీఓ 1, ఎస్‌ఎ 11, జేఏ 9 మంది చొప్పున మొత్తం 55 మందిని కేటాయించినట్లు సీఎండీ ప్రకటించారు. ఇందులో 25 మంది తిరుపతి ఎస్‌ఈ కార్యాలయం, మిగిలిన ఉద్యోగులు అన్ని డివిజన్ల కార్యాలయం నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించారు. కానీ ఇంక దాదాపు 15 మంది అధికారులు చిత్తూరు వైపు కన్నెత్తి చూడలేదు. తిరుపతి నుంచి రావడం ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల విభజనపై కమిటీ వేసిన ప్రతి నెలా ఈ నెలలో కేటాయింపులు పూర్తి చేస్తామంటూ అధికారులు చెప్పుకోవడంతోనే సరిపోతుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడినందునే పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉంది. దీనికి తోడు డీపీఈ విభాగానికి కార్యాలయం కేటాయించాల్సి ఉంది.

చిత్తూరుపై అనాసక్తి

మొదటి నుంచి తిరుపతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు చిత్తూరుకు రావాలంటే ఆసక్తి చూపడం లేదు. పలు విభాగాల హెచ్‌ఓడీలే చిత్తూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. కానీ పలు విభాగాల ఏఈలు, కార్యాలయాల సిబ్బంది అయిన జూనియర్‌, సీనియర్‌ సహాయకులు 15 మంది వరకు రాలేదు. చిత్తూరుకు రావడానికి ఏదో సాకులు చెబుతూ 5 నెలలుగా కాలం వెళ్లదీశారు. మొదట చిత్తూరు రూరల్‌, ఎస్‌ఈ కార్యాలయం రెండు ఒకేచోట ఉండడంతో విధులు నిర్వహించడానికి స్థలం లేదన్నారు. తర్వాత తుపాను సమయమని రిలీవ్‌ చేయడం లేదన్నారు. చివరిగా రూరల్‌ కార్యాలయాన్ని పాతకలెక్టరేట్‌లో ఏర్పాటు చేయగా ఉద్యోగులు అక్కడికి మారారు. అయిన ఇంకా తిరుపతి నుంచి ఉద్యోగులు రావడానికి తీరిక లేకుండా పోయింది. ఇప్పుడు పిల్లలు పరీక్షల సమయం అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తర్వాత వారి చదువుల కోసం కళాశాలలు మారడం కష్టమంటారో ఏమీ తెలియడం లేదని స్థానిక ఉద్యోగులు అంటున్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు అందుబాటులోకి రాకపోవడంతో విద్యుత్‌ సేవలు, పలు అభివృద్ధి పనులపై త్రీవ ప్రభావం చూపుతోంది. శాఖాపరమైన వ్యవహారాలు తదితర అంశాల్లో పురోగతి నిలిచిపోయింది. జిల్లా సమాచారం ఎస్‌ఈ కార్యాలయంలో అందుబాటులో లేదు. ఎప్పుడు అడగని ఇంక పూర్తి స్థాయిలో విభజన జరగలేదు, ఆన్‌లైన్‌ కావాలంటూ సాకులు చెబుతున్నారు. ఈ నెలలోగా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తామని ఎస్‌ఈ ఇస్మాయిల్‌అహ్మద్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement