
విందు వద్ద తమ్ముళ్లు, జనం
పూతలపట్టు/కాణిపాకం : టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. సోమవారం పూతలపట్టులో ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ నామినేషన్ చేసేందుకు గాను జనసమీకరణకు డబ్బులు వెదజల్లారు. ప్రతీ పంచాయతీకి వాహనాలు పంపించి జనాన్ని తరలించే యత్నించారు. 40కుపైగా బస్సులు, 20కుపైగా ట్రాక్టర్లు, ఆటోలు 50, లారీలు, ఐషర్ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలను పూతలపట్టుకు తీసుకొచ్చారు. ఇందుకు గాను రూ.5 లక్షల వరకు ఖర్చుపెట్టినట్లు తమ్ముళ్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. నామినేషన్‌కు తీసుకువచ్చిన వారికి పెళ్లిపేరుతో విందు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి జంట బ్యానర్ వేసి బహిరంగంగానే విందు పెట్టారు. ఈలెక్కన విందుకు రూ.5 లక్షల వరకు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. అలాగే మద్యం పంపిణీ షరా మామూలుగానే సాగింది. కాగా, వచ్చిన జనాలకు అందించిన మొత్తం దాదాపు రూ.10లక్షలు దాటినట్లు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.