
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్‌కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్‌కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్‌కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్‌లలో లాభాలు, బిట్‌కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగాయి.
ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్‌డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్‌మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్‌కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్‌ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.
సాధారణంగా అక్టోబర్ నెల బిట్‌కాయిన్‌కు అనుకూలమైనది.. దీనిని "అప్‌టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్‌కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.
బిట్‌కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?
బిట్‌కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్‌కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్.. విజయ్ దేవరకొండ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?