
క్యూ1 లాభం రూ. 3,337 కోట్లు; 10% అప్
ఉద్యోగుల సంఖ్య @ 2,33,232
కొత్తగా 497.1 కోట్ల డాలర్ల ఆర్డర్లు
షేరుకి రూ. 5 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,337 కోట్లకు చేరింది. డీల్స్‌లో వృద్ధి ఇందుకు దోహదపడింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 3,037 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
ఆగస్ట్ 15కల్లా చెల్లించనుంది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,964 కోట్ల నుంచి రూ. 22,135 కోట్లకు బలపడింది. ఈ కాలంలో కొత్తగా 497.1 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇవి 51 శాతం అధికంకాగా.. వీటిలో 131 శాతం వృద్ధితో 266.6 కోట్ల విలువైన భారీ డీల్స్ సాధించింది. క్యూ1లో 114 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,2325 మందికి పరిమితమైంది. ఉద్యోగ వ్యయాలు రూ. 13,428 కోట్లకు చేరాయి.
–1 నుంచి +1 మధ్య..: ఈ ఏడాది రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్)లో ఆదాయంలో –1 నుంచి +1 మధ్య వృద్ధి నమోదుకావచ్చని తాజాగా అంచనా (గైడెన్స్) ప్రకటించింది. ఇది త్రైమాసికవారీ అంచనా కాగా.. 256–261.2 కోట్ల డాలర్ల మధ్య ఐటీ సర్వీసుల ఆదాయం సాధించవచ్చని భావిస్తోంది. ఆదాయంలో బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం వాటా 34 శాతంకాగా.. కన్జూమర్ 19 శాతం, కన్జూమర్ 19 శాతం, ఎనర్జీ 18 శాతంగా ఉంది. ఏడాది కాలంలో రెండుసార్లు డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అపర్ణ అయ్యర్ పేర్కొన్నారు.
అనిశ్చితిలో..
అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో కొత్త ఏడాదిని ప్రారంభించాం. దీంతో డిమాండ్ మందగించింది. మా క్లయింట్లు వ్యయ నియంత్రణ, వెండార్ కన్సాలిడేషన్‌పై దృష్టి పెట్టాం. అయితే ఇదేసమయంలో ఏఐ, డేటా, ఆధునీకరణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. భారీ డీల్స్ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి మరింత పురోగతి సాధిస్తాం.
– శ్రీని పాలియా, విప్రో సీఈవో–ఎండీ
ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు 1% తగ్గి రూ. 260 వద్ద ముగిసింది.