కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే? | Sakshi
Sakshi News home page

కిర్గిస్తాన్‌కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?

Published Thu, May 23 2024 5:01 PM

Why Indian Students Studying MBBS In Kyrgyzstan? Here's The Reason

కిర్గిస్తాన్‌లో ఇటీవల ఘర్షణలు

విదేశీ, స్థానిక విద్యార్థుల మధ్య ఘర్షణలు

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కిర్గిస్తాన్‌

మెడికల్‌ విద్యకు ఇటీవల పెరిగిన ప్రాచుర్యం

గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థులు కిర్గిస్తాన్ దేశంలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా ఉంది. అయినా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు చేస్తున్నాయి కాలేజీలు. హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని తొలుత ఇండియన్​ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత పరిస్థితిలో మార్పువచ్చింది. అసలు భారతీయ విద్యార్థులు ఈ దేశానికీ ఎందుకు వెళ్తున్నారు? అక్కడి కరెన్సీ విలువ ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎలా ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కిర్గిస్తాన్‌లో జరిగింది చిన్న గొడవే
కిర్గిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ముగ్గురు స్థానిక విద్యార్థులు ఈజిప్ట్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఉండే హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ చిన్న గొడవ జరగగా.. స్థానిక విద్యార్థులను ఈజిప్టు విద్యార్థులు కొట్టినట్టు తెలిసింది. దీంతో స్థానికంగా కొన్ని ఆందోళనలు జరిగాయి. అయితే కిర్గిస్తాన్‌ ప్రభుత్వ పెద్దలు అందరూ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. తమ దేశం శాంతి, సౌభాగ్యాలకు చిహ్నమని, విదేశీ విద్యార్థుల వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం ఉందని ప్రకటనలు చేశారు. 

కిర్గిస్తాన్‌కు మనవాళ్లు ఎందుకు వెళ్తున్నారు?
కిర్గిస్తాన్‌.. మధ్య ఆసియా ప్రాంతం. భౌగోళికంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి కిర్గిస్తాన్‌కు వెయ్యి కిలోమీటర్ల కంటే తక్కువ దూరం. చాలా కాలం పాటు సోవియట్‌ పాలనలో ఉండడం వలన కిర్గిస్తాన్‌లో యూరోపియన్‌ కల్చర్‌ కనిపిస్తుంది. అందమైన కొండలు, గల గల పారే నదులు, పచ్చిక బయళ్లు, వాటి మధ్య రాజప్రాసాదాలు... ఇలా అందమైన ఈ ప్రాంతం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది. 

విద్యార్థులు వారి సొంత దేశాలను వదిలి కిర్గిజిస్తాన్‌కు వెళ్లి చదువుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి చదువుకోవడానికి అయ్యే ఖర్చులు తక్కువగా ఉండటమే. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే సంవత్సరానికి కనీసం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కిర్గిజిస్తాన్‌లో అయితే ఏడాదికి సుమారు రూ. 15 నుంచి 20 లక్షలు (హాస్టల్.. ఫుడ్‌తో సహా) ఖర్చు పెడితే సరిపోతుందని చెబుతున్నారు.

కిర్గిస్తాన్‌ కరెన్సీ విలువ
ఇక కరెన్సీ విషయానికి వస్తే.. కిర్గిస్తాన్‌ కరెన్సీ విలువ, ఇండియన్ రూపాయికి దాదాపు సమానంగా ఉంటుంది. అయితే ఖర్చుల పరంగా చూస్తే మనదేశం కంటే అక్కడ కొంత తక్కువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ దేశానికి.. పలు దేశాల నుంచి విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు.

కిర్గిస్తాన్‌కు ఆదాయం ఎలా?
కిర్గిస్తాన్‌లో పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తక్కువ. అయితే ఇక్కడ విలువైన గనులు, ప్రకృతి వనరులు ఉన్నాయి. ఈ దేశానికి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చేది బంగారం నిల్వల నుంచే. బంగారంతో పాటు వెండి, యురేనియం, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. అయితే వీటితో పాటు పర్యాటకం, విదేశీయుల విద్య ఇప్పుడు కిర్గిస్తాన్‌కు అత్యంత కీలకంగా మారాయి. 

ఇండియన్‌ మెడిసిన్‌ కేరాఫ్‌ కిర్గిస్తాన్‌
కిర్గిస్తాన్‌లో పాతికేళ్ల క్రితమే భారతీయులు మెడిసిన్‌ విద్యకు బాట వేసుకున్నారు. ఇండియా నుంచే ఫ్యాకల్టీని తెస్తున్నారు. ఇక్కడి యూనివర్సిటీలు, కాలేజీల్లో చాలా వరకు ఇండియన్‌ డాక్టర్ల టీచింగ్‌ క్లాసులు ఉంటాయి. దీని వల్ల మన వాళ్లు భారీగా కిర్గిస్తాన్‌కు క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో 25వేల మంది భారతీయ విద్యార్థులు ఉండొచ్చని చెబుతున్నారు. వీరితో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్టు లాంటి దేశాల నుంచి కూడా భారీగా విద్యార్థులు వచ్చి కిర్గిస్తాన్‌లో చదువుతున్నారు. ఇక్కడ మెడిసిన్‌ చదివి, ఇండియాలో FMGE అంటే Foreign Medical Graduate Examination పరీక్ష రాయాలి. దీంట్లో అర్హత సాధిస్తే.. వైద్యుడిగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. 

ఇండియాలో మంచి ప్రైవేట్‌ కాలేజీలో మెడిసిన్‌ చదవాలంటే కోటి ఖర్చు. అదే కిర్గిస్తాన్‌లో అయితే పాతిక లక్షల్లో మెడిసిన్‌ పూర్తి చేసుకోవచ్చు. పైగా FMGE పరీక్షకు కూడా కిర్గిస్తాన్‌లోనే కోచింగ్‌ ఇస్తున్నారు. పెరిగిన విద్యార్థుల వల్ల ఇండియన్‌ హాస్టళ్లు, సెక్యూరిటీ, ట్రాన్స్‌పోర్ట్ ఇతర సౌకర్యాలు చాలా వరకు మెరుగుపరిచారు. అందుకే కిర్గిస్తాన్‌ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement