
జూన్ త్రైమాసికంలో 10 శాతం డౌన్
134.9 టన్నులకు పరిమితం
వెల్లడించిన ప్రపంచ స్వర్ణ మండలి
ముంబై: పసిడి ధరలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో డిమాండ్ (పరిమాణం పరంగా) తగ్గుముఖం పట్టింది. జూన్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 134.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో డిమాండ్ 149.7 టన్నుల కంటే ఇది 10 శాతం తక్కువ. ధరలు రికార్డు స్థాయిలకు చేరడం కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. ధరలు పెరిగిన ఫలితంగా పుత్తడి కొనుగోలుపై భారతీయులు అధికంగా వెచ్చించాల్సి వచ్చినట్టు తెలుస్తోంది.
విలువ పరంగా పసిడి డిమాండ్ రూ.1,21,800 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఉన్న రూ.93,850 కోట్ల కంటే 30% పెరిగింది. బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్ పరిమాణం పరంగా 17 శాతం తగ్గి 88.8 టన్నులకు పరిమితమైంది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 106.5 టన్నులుగా ఉంది. విలువ పరంగా బంగారు ఆభరణాల డిమాండ్ 20 శాతం పెరిగి రూ.80,150 కోట్లకు చేరింది. ధరలు పెరగడం ఫలితంగా ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, అదనంగా ఖర్చు చేయాల్సి రావడం విలువ పెరిగేందుకు దారితీసింది.
పెట్టుబడి పరంగా డిమాండ్..
పెట్టుబడి పరంగా బంగారం డిమాండ్ 7 శాతం పెరిగి 46.1 టన్నులుగా జూన్ త్రైమాసికంలో నమోదైంది. విలువ పరంగా చూస్తే డిమాండ్ 54 శాతం పెరిగి రూ.41,650 కోట్లకు చేరుకుంది. దీర్ఘకాలానికి విలువ పెరిగే సాధనంగా బంగారాన్ని చూస్తున్నారనడానికి ఇది నిదర్శమని డబ్ల్యూజీసీ భారత సీఈవో సచిన్ జైన్ తెలిపారు. బంగారం దిగుమతులు 34 శాతం తగ్గి 102.5 టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 150 టన్నులుగా ఉన్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది మరోపక్క, బంగారం రీసైక్లింగ్ (పునర్వినియోగపరిచిన) డిమాండ్ ఒక శాతం పెరిగి 23.1 టన్నులకు చేరుకుంది.
6 నెలల్లో 253 టన్నులు..
జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు ఔన్స్‌కు సగటున 3,280 డాలర్లుగా ఉంటే, 10 గ్రాముల ధర భారత్‌లో రూ.90,307 స్థాయిలో ఉన్నట్టు సచిన్ జైన్ తెలిపారు. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి ప్రాధాన్యం కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది తొలి 6 నెలల్లో (జనవరి–జూన్) భారత్‌లో బంగారం డిమాండ్ 253 టన్నులుగా ఉండగా, పూర్తి ఏడాదికి 600–700 టన్నుల మధ్య ఉండొచ్చని సచిన్‌జైన్ తెలిపారు. ధరల్లో స్థిరత్వం ఏర్పడితే డిమాండ్ గరిష్ట స్థాయిలో 700 టన్నులకు చేరుకోవచ్చన్నారు. ధరల పెరుగుదల కొనసాగితే డిమాండ్ 600 టన్నులకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు.