UPI కొత్త ఫీచర్లు.. ఫోన్‌ డేటా లేకున్నా ట్యాప్‌తో పేమెంట్‌! | UPI new features NPCI launches tap-to-pay unified UPI services window | Sakshi
Sakshi News home page

UPI కొత్త ఫీచర్లు.. ఫోన్‌ డేటా లేకున్నా ట్యాప్‌తో పేమెంట్‌!

Sep 11 2026 9:00 AM | Updated on Sep 11 2026 9:29 AM

UPI new features NPCI launches tap-to-pay unified UPI services window

డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింత సులభతరం చేసే దిశగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI)లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ముంబైలో జరుగుతున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ 2026లో ‘UPI Tap & Pay’, AI ఆధారిత ‘MyUPI’ వంటి కొత్త సదుపాయాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా, ఎన్‌పీసీఐ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అజయ్‌ కుమార్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ సెప్టెంబర్‌ 8 నుంచి 11 వరకు ముంబైలో జరుగుతోంది.

ఫోన్‌ డేటా లేకున్నా ‘ట్యాప్‌ అండ్‌ పే’

ఇప్పటివరకు యూపీఐ చెల్లింపులు సాధారణంగా యాప్‌ ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారానో లేదా అవతలివారి ఫోన్‌ నంబర్‌, అకౌంట్‌ వివరాలు నమోదు చేయడం ద్వారానో చేస్తున్నాం. దీనికి ఫోన్‌లో ఇంటర్‌నెట్‌ అవసరం. కొత్త ‘Tap & Pay’ ఫీచర్‌తో NFC (Near Field Communication) సదుపాయం ఉన్న POS టెర్మినల్‌ వద్ద ఫోన్‌ను ట్యాప్‌ చేసి చెల్లింపు చేయవచ్చు. ముఖ్యంగా వినియోగదారుడి ఫోన్‌కు మొబైల్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా ఈ చెల్లింపు సాధ్యమవుతుంది. లావాదేవీకి అవసరమైన కనెక్షన్‌ను POS టెర్మినల్‌ ఇంటర్నెట్‌ ద్వారా పొందుతుంది.

ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి, అనుకూలమైన POS మెషీన్‌పై ట్యాప్‌ చేయడం ద్వారా పేమెంట్‌ ప్రారంభించవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా యూపీఐకి అనుసంధానమైన ఖాతాలతో పాటు రూపే క్రెడిట్‌ కార్డు చెల్లింపులు కూడా చేయొచ్చు.

రూ.5,000 వరకు పిన్‌ అవసరం లేదు

కొత్త ఫీచర్‌లో రూ.5,000 వరకు లావాదేవీలకు UPI PIN అవసరం ఉండదు. అయితే రూ.5,000 దాటిన చెల్లింపులకు PIN నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల చిన్న మొత్తాల దుకాణాలు, రెస్టారెంట్లు, రిటైల్‌ షాపులు తదితర చోట్ల చెల్లింపులు మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం వ్యాపారి వద్ద NFCకి అనుకూలమైన POS టెర్మినల్‌ ఉండాలి.

‘మైయూపీఐ’తో అన్ని వివరాలు ఒకే చోట

ఎన్‌పీసీఐ మరో కీలక సదుపాయం ‘MyUPI’ని కూడా ప్రారంభించింది. ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన చిన్న భాషా నమూనా (Small Language Model) ‘FiMI’ ఆధారంగా రూపొందించిన ఈ AI ప్లాట్‌ఫామ్‌ యూపీఐ వినియోగదారులకు కస్టమర్‌ సపోర్ట్‌, లావాదేవీల నిర్వహణను సులభతరం చేస్తుంది.

వినియోగదారులు వివిధ బ్యాంకులు, యూపీఐ యాప్‌లలో ఉన్న తమ యూపీఐ లావాదేవీలు, ఆటోపే ఆదేశాలను ఒకే చోట చూసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో బ్యాంకు లేదా యాప్‌ను విడిగా తెరవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.

మోసం జరిగితే ‘సేఫ్టీ స్విచ్‌’

MyUPIలో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఖాతా రాజీపడిందని లేదా మోసం జరిగే అవకాశం ఉందని అనుమానం వస్తే యూపీఐ డెబిట్‌ లావాదేవీలను తిరస్కరించేలా ‘Safety Switch’ ద్వారా ఆపే అవకాశం ఉంటుంది.

అదే విధంగా మొబైల్‌ నంబర్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు స్వీకరించే సదుపాయాన్ని డీలింక్‌ చేయడం, వ్యాపారికి చెల్లించే ముందు మరిన్ని వివరాలు తెలుసుకోవడం, గతంలో చేసిన నమ్మకమైన చెల్లింపును మళ్లీ చేయడం వంటి సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అర్హత కలిగిన సందర్భాల్లో ఛార్జ్‌బ్యాక్‌ ప్రక్రియను ఆటోమేటిక్‌గా నిర్వహించే సదుపాయాన్ని కూడా MyUPI అందిస్తుంది. 24x7 వివిధ భాషలలో కస్టమర్‌ సపోర్ట్‌ కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement