రూ. 79–84గా షేర్ల ధర శ్రేణి
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం హీరో మోటర్స్ తమ ఐపీవోకి సంబంధించి షేర్ల ధర శ్రేణి రూ. 79–84గా ఉంటుందని వెల్లడించింది. దీని ద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించనుంది. ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 16న ప్రారంభమై 18న ముగుస్తుంది. సెప్టెంబర్ 23న లిస్ట్ కావొచ్చని అంచనా. ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ప్రమోటర్లు రూ. 400 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో ఓపీ ముంజల్ హోల్డింగ్స్ రూ. 395 కోట్ల షేర్లను, హీరో సైకిల్స్ రూ. 5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి.
తాజా షేర్ల జారీ ద్వారా లభించే నిధుల్లో రూ. 190 కోట్ల మొత్తాన్ని నిర్దిష్ట రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, రూ. 200 కోట్లను ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్లాంటు విస్తరణకి యంత్రపరికరాలను కొనుగోలు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. మిగతా మొత్తాన్ని ఇతర సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించుకోనుంది. హీరో మోటర్స్ 2025 జూన్‌లో రూ. 1,200 కోట్ల సమీకరణ కోసం డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. దాని ప్రకారం తాజా షేర్ల జారీ ద్వారా రూ. 800 కోట్లు, ఓఎఫ్‌ఎస్ కింద రూ. 400 కోట్లు సమీకరించాలని సంస్థ భావించింది. ఆ తర్వాత తాజా షేర్ల జారీని రూ. 600 కోట్లకు కుదించడంతో మొత్తం ఐపీవో పరిమాణం రూ. 1,000 కోట్లకు పరిమితమైంది.


