సాక్షి,న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2వేలు అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన మర్చంట్ (వ్యాపార) యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనను దీపావళి పండగ తర్వాత అమల్లోకి తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీలు ఇప్పటికే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, పండుగ సీజన్ కారణంగా ఈ అమలును వాయిదా వేయొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలను ప్రస్తావిస్తూ... యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలును దీపావళి తర్వాత వరకు వాయిదా వేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) మంగళవారం తెలిపింది.
యూపీఐ, స్ట్రీరింగ్ కమిటీ పర్సన్-టూ-మర్చంట్ (P2M) లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలను దీపావళి పండుగ తర్వాత తక్షణమే అమలు చేయాలని భావిస్తోంది. దీనిని ఎప్పుడు అమలు చేయాలి? ఆ తేదీ, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్‌పీసీఐ అధికారికంగా వెల్లడించింది.
ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా సాగుతున్న యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ నిర్ణయం పెద్దఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంది. సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే, బ్యాంకులు తమ సీఏఎస్‌ఏ (సీఏఎస్‌ఏ- కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్ల ద్వారా ఇప్పటికే భారీ వడ్డీ మార్జిన్‌లను ఆర్జిస్తున్నాయని ఇటీవల ఐఐటీ-బాంబే నివేదిక వెలుగులోకి వచ్చింది. యూపీఐ ఎకోసిస్టమ్‌ను నిర్వహించడానికి, మెరుగుపరచడానికి బ్యాంకులు ఆ నిధులను ఉపయోగించాలని ఆ నివేదిక సూచించింది. అయినప్పటికీ, మర్చంట్ లావాదేవీల ఫీజు అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం.


