
సోషల్ మీడియా ప్రమోషన్ల కోసం కంటెంట్ క్రియేటర్లందరికీ తప్పనిసరిగా ‘అడ్వర్టైజర్ పర్మిట్’ అవసరమని యూఏఈ మీడియా కౌన్సిల్ ప్రకటించింది. కంటెంట్ క్రియేటర్లు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ అనుమతి మంజూరు చేస్తామని తెలిపింది. ఈ విధానం త్వరలో అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే కంటెంట్ క్రియేటర్లకు ఈ అనుమతులు మొదటి మూడేళ్లు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెన్యువల్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
క్రియేటర్లు దరఖాస్తు చేసుకున్న తర్వాత వెరిఫై చేసి ప్రభుత్వం వారికి పర్మిట్ నంబర్లను కేటాయిస్తుంది. ఈ పర్మిట్ నంబర్లను కంటెంట్ క్రియేటర్లు తమ అకౌంట్‌లపై స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. కౌన్సిల్ నుంచి అనుమతులు పొందిన తరువాత మాత్రమే ప్రకటనలు పోస్ట్ చేయాలి. యూఏఈ మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ సయీద్ అల్ షెహి మాట్లాడుతూ.. ‘అడ్వర్టైజర్ పర్మిట్ అనేది ప్రజా హక్కులను కాపాడుతుంది. కంటెంట్ సృష్టికర్తలు, ప్రకటనదారులు, ప్రేక్షకుల మధ్య బాధ్యతాయుతమైన, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుస్తుంది’ అని చెప్పారు. సొంత ఉత్పత్తులు లేదా సర్వీస్ లేదా కంపెనీని ప్రమోట్ చేయడానికి వ్యక్తిగత ఖాతాలను ఉపయోగించే వారికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తామని కౌన్సిల్ పేర్కొంది. ఎడ్యుకేషన్, అథ్లెటిక్, సాంస్కృతిక లేదా అవగాహన కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ వెసులుబాటు ఉంటుందని చెప్పింది.
యూఏఈ మీడియా కౌన్సిల్లో స్ట్రాటజీ అండ్ మీడియా పాలసీ సెక్టార్ సీఈఓ మైతా మజీద్ అల్ సువైది మాట్లాడుతూ.. కౌన్సిల్ ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులతో మాత్రమే కంపెనీలు, సంస్థలు టైఆప్ కావాలని తెలిపారు. విజిటింగ్ కంటెంట్ క్రియేటర్లు ‘విజిటర్ అడ్వర్టైజర్ పర్మిట్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మూడు నెలలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత మూడు నెలలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. యూఏఈలో కౌన్సిల్ ఆమోదించిన లైసెన్స్డ్ అడ్వర్టైజింగ్ లేదా టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు.
భారత్‌పై ప్రభావం ఎంతంటే..
భారత్ కేవలం యూఏఈకి పొరుగు దేశం మాత్రమే కాదు. ఇది దాని డిజిటల్, కల్చరల్ ఎకోసిస్టమ్‌లో కీలకమైన స్థానంలో ఉంది. యూఏఈ డిజిటల్ టాలెంట్ పూల్‌లో భారతీయ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు గణనీయమైన భాగం ఉన్నారు. తాజా నిర్ణయంతో యూఏఈ ఆధారిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న భారతీయ ఇన్‌ఫ్లూయెన్సర్లపై ప్రభావం ఉండనుంది. అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, భారతీయ ప్రవాసులు కంటెంట్‌ను సృష్టించడంలో సదరు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారతీయ బ్రాండ్లు, ఏజెన్సీలు యూఏఈ ఆధారిత ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేయడం లేదా గల్ఫ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రచారాలను నిర్వహించడంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.
మన కంటెంట్ క్రియేటర్లకు కొత్త సవాళ్లు
ప్రమోషనల్ కంటెంట్‌పై చెల్లుబాటు అయ్యే ప్రకటనదారు పర్మిట్ నెంబరును పొందాల్సి ఉంటుంది. దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి.
కంటెంట్ సృష్టించే స్వల్పకాలిక సృష్టికర్తలు లేదా పర్యాటకులకు యూఏఈ ఆధారిత ఏజెన్సీ స్పాన్సర్‌షిప్ అవసరం.
అన్‌పెయిడ్ ఎండార్స్‌మెంట్లు ఇప్పుడు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.
నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, ప్లాట్‌ఫామ్ ఆంక్షలు లేదా నిషేధానికి కూడా దారితీసే అవకాశం ఏర్పడవచ్చు.
ఇక్కడా ఇలాంటి నిబంధనలు?
ఇన్‌ఫ్లూయెన్సర్ రెగ్యులేషన్‌లో భారత్ అడ్వాన్స్‌గానే ఉంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ), వినియోగదారుల రక్షణ చట్టం ఇప్పటికే వీటి అవసరాన్ని హైలైట్ చేశాయి. భారత్‌లో ఇప్పటికే పెయిడ్ కొలాబరేషన్‌కు సంబంధించిన వివరాలను స్పష్టంగా వెల్లడించాలి. #ad, #sponsored లేదా #collab వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో కంటెంట్‌కు లేబులింగ్ ఇవ్వాలి.
యూఏఈ తీసుకున్న నిర్ణయం భారత్‌లో మరిన్ని నియంత్రణ చర్యలకు దారితీసే అవకాశం ఉంది. తప్పుడు సమాచారం, పెయిడ్ ఎండార్స్‌మెంట్లు, డిజిటల్ మార్కెటింగ్‌లో ఆర్థిక పారదర్శకతపై పెరుగుతున్న పరిశీలన, భారత ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లైసెన్సింగ్ నమూనాలను కఠినంగా అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు.

యూఏఈ అడ్వర్టైజర్ పర్మిట్ రూల్ ప్రయోజనాలు
పారదర్శకత
వీక్షకులు ప్రమోషనల్ కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించగలరు. మోసపూరిత ప్రకటనల అవకాశాలను తగ్గించవచ్చు. ఇది ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రేక్షకుల మధ్య ఎక్కువ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
పరిశ్రమపై పక్కా ప్రమాణాలు
ఇన్‌ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ కోసం ప్రమాణాలను ఏర్పరుస్తుంది. క్రియేటర్లకు వ్యాపార అవకాశాలు అందిస్తుంది.
వినియోగదారుల రక్షణ
ముఖ్యంగా ఫైనాన్స్, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే లేదా అప్రకటిత ఎండార్స్‌మెంట్ల నుంచి రక్షణ లభిస్తుంది. అన్‌పెయిడ్ ప్రమోషన్లను కూడా నియంత్రిస్తుంది.
ప్రభుత్వానికి రెవెన్యూ
పర్మిట్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇన్‌ఫ్లూయెన్సర్ క్యాంపెయిన్లు, బ్రాండ్ కోలాబరేషన్లపై ట్రాకింగ్ ఉంటుంది.
ఇదీ చదవండి: ‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’
యూఏఈ ప్రకటనతో నష్టాలు
చిన్న కంటెంట్ క్రియేటర్లలో నిరుత్సాహం
ఫ్రీలాన్సర్లు, మైక్రో-ఇన్‌ఫ్లూయెన్సర్లు, స్పాన్సర్ అవసరాలను నిర్వహించడం కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చేవారిని నిరుత్సాహపరుస్తుంది.
యూఏఈ కాని క్రియేటర్లకు..
యూఏఐ వెలుపల కంటెంట్ సృష్టికర్తలు (ఉదా. భారతదేశంలో లేదా మరెక్కడైనా) అక్కడి ప్రేక్షకులను ప్రభావితం చేసేందుకు చట్టాలు అడ్డంకిగా మారుతాయి. గ్లోబల్ డిజిటల్ కంటెంట్‌లో పరిధులు నిర్ధారించినట్లు అవుతుంది.
సందర్శకులకు పరిమితులు
తాత్కాలికంగా యూఏఈని సందర్శించే సృష్టికర్తలకు (ఉదా.ట్రావెల్ వ్లాగ్‌లు లేదా ఈవెంట్ల కోసం) పరిమిత అనుమతులుంటాయి. ఇందుకోసం స్థానిక స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది.