
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. రాష్ట్రంలోని సన్‌రైజ్ కంపెనీల(ఎమర్జింగ్ పరిశ్రమలు)కు ఇచ్చిన కార్మిక చట్టాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
‘టీసీఎస్ నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు. అకస్మాత్తుగా 12,000 మంది తొలగింపు అంటే చాలా ప్రమాదం. ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అంతకుమించి స్పష్టమైన కారణం కూడా తెలుసుకుంటాను. కార్మిక చట్టాన్ని పరిశీలిస్తాం. సన్ రైజ్ కంపెనీలకు నిత్యం చాలా వెసులుబాట్లు ఇస్తూనే ఉంటాం’ అని మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ జోక్యం కోరిన ఎన్ఐటీఈఎస్
లేఆఫ్స్‌కు సంబంధించి వివరణ కోరుతూ టీసీఎస్‌కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్) కోరింది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్యను 5,000 పెంచింది.
ఇదీ చదవండి: క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
సన్‌రైజ్ పరిశ్రమలు
నూతన ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్‌రైజ్ పరిశ్రమలకు(అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీలు) కార్మిక చట్టం మినహాయింపులు ఇస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన నియామకాలు, తొలగింపు నిబంధనలున్నాయి. స్టార్టప్‌లు, టెక్ ఆధారిత సంస్థలకు ఈ చట్టం ద్వారా మద్దతు లభిస్తుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, స్పేస్ టెక్, ఏరోస్పేస్ వంటి విభాగాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.