బంగారం ధరల నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని పేర్కొంటూ, ప్రస్తుతం జరుగుతున్న కొన్ని అశాస్త్రీయ ధోరణులపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు.
అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధర ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్ ధరలు బంగారం ట్రేడింగ్ రేట్లను ప్రభావితం చేస్తాయి.
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం రేటు కూడా బంగారం ధరను నిర్ణయిస్తుంది. రూపాయి విలువ పడితే పసిడి ధర కూడా అందుకు అనుగుణంగా మారుతుంది.
ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ కూడా కనకం ధర పెరిగేందుకు కారణమవుతుంది.
ప్రస్తుత సమస్య ఏమిటంటే..
కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా, స్పష్టమైన కారణం లేకుండా ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారని అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు బంగారం మార్కెట్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఇది దీర్ఘకాలంలో పరిశ్రమకు నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. సాధారణంగా వాణిజ్య సంఘాలు ఉదయం 9:30 గంటలకే ధరలను నిర్ణయిస్తాయని, కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆకస్మిక మార్పులు వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయని తెలిపారు.
వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్
వినియోగదారుల ప్రయోజనాల కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ విధానాన్ని అమలు చేస్తోందని అహ్మద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పన్నులు ఒకేలా ఉన్నప్పుడు, బంగారం ధర కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండాలన్నారు. ధరల అసమానతలను తొలగించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకతను పాటించాలని చెప్పారు.
ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?


