మారుతి సుజుకి తన గ్రాండ్ విటారా కారుకు ఫ్యూయెల్ గేజ్ కారణంగా రీకాల్ ప్రకటించిన తరువాత.. టాయోటా కూడా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు రీకాల్ జారీ చేసింది. ఈ కారుకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం కూడా ఫ్యూయెల్ గేజ్ సమస్య కావడం గమనార్హం.
2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన టయోటా అర్బన్ క్రూయిజర్ కార్లు రీకాల్‌కు ప్రభావితమయ్యాయి. ఫ్యూయెల్ గేజ్ సమస్య కారణంగా.. కారులో ఎంత ఇంధనం ఉందనే విషయాన్ని వాహన వినియోగదారుకు చూపించదు. దీనివల్ల దూర ప్రయాణం సమయంలో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే.. తక్కువ ఇంధనం ఉన్నప్పుడు కూడా ఇండికేటర్ చూపించకపోవడం వల్ల, డ్రైవర్ ఎప్పుడు ఫ్యూయెల్ ఫిల్ చేసుకోవాలో తెలియకుండా పోతుంది. ఇది అత్యవసర సమయంలో ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఇదీ చదవండి: భారీగా పెరిగిన వెహికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజు: కొత్త ధరలు ఇలా..
సమస్యకు ప్రభావితమైన కార్లను కంపెనీ గుర్తించి, యజమానులకు సందేశం (ఎస్ఎమ్ఎస్, ఈమెయిల్) పంపిస్తుంది. తద్వారా ఓనర్ కారులోని సమస్యను ఉచితంగానే పరిష్కరించుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.


