భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా క్రిస్టా కారును టయోటా కంపెనీ నిలిపివేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ దీనిని 2027 నాటికి దశలవారీగా తొలగించనున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టయోటా కంపెనీ 2025లో మొదటిసారిగా.. తన ఇన్నోవా క్రిస్టా కారును దశలవారీగా తొలగించాలని ప్రణాళిక వేసింది, కానీ హైక్రాస్ ప్రవేశపెట్టిన తర్వాత.. కూడా క్రిస్టా ఉత్పత్తిని విస్తరించాలని నిర్ణయించుకుంది. అయితే కఠినమైన ఉద్గార నిబంధనలు కారణంగా.. దీనిని నిలిపివేసేందుకు ఇప్పుడు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కఠినమైన CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ) నిబంధనల ప్రకారం.. కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే.. చాలాకాలంగా ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా కొనసాగించిన కారు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త క్రిస్టా కారును కొనుగోలు చేయలేమని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. ఇది 148 BHP & 343 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ కార్ల విక్రయాలను తగ్గిస్తున్నాయి. ఇది కూడా టయోటా కంపెనీ తన క్రిస్టా కారును నిలిపివేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది.


