
భారతీయ ఐటీ కంపెనీలు ముప్పులో ఉన్నాయని, వాస్తవ పరిస్థితిని తెలుసుకుని మేల్కోకపోతే మునిగిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలు తమ ఏఐ (AI) సామర్థ్యాలను పెంచుకోవడంలో విఫలమైతే మసకబారే ప్రమాదం ఉందని గ్లోబల్ ఈక్విటీస్ రీసెర్చ్లో ఈక్విటీ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ త్రిప్ చౌదరి హెచ్చరించారు.
ఏఐకి సంబంధించి మన ఐటీ కంపెనీలు (Indian IT companies) తీవ్రంగా వెనుకబడి ఉన్నాయని, ఏఐ సమర్థవంతమైనవి కావని త్రిప్ చౌదరి ఎన్డీటీవీ ప్రాఫిట్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. ప్రతి ఐటీ కంపెనీ కొత్త వాస్తవికతను తెలుసుకుని మేల్కొనాలని, లేకుంటే అవి ఎప్పటికీ అదృశ్యమవుతాయని హెచ్చరించారు. లెగసీ సేవలు, అప్లికేషన్ నిర్వహణ, ఖర్చు నియంత్రణపై ఎక్కువగా ఆధారపడే భారతీయ ఐటీ కంపెనీలు, ప్రపంచ కంపెనీలతో పోటీ పడటానికి ఏఐ స్వీకరణను వేగవంతం చేయాలని సూచించారు.
భవిష్యత్తు చిన్న ఐటీ కంపెనీలదే..
దేశీయ ఐటీ కంపెనీల వృద్ధి అవకాశాలపై ఫండ్ మేనేజర్, సోవిలో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఎల్ఎల్పీ సహ వ్యవస్థాపకుడు సందీప్ అగర్వాల్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో పెద్ద ఐటీ కంపెనీలు బలమైన వృద్ధిని చూస్తాయని తాను ఆశించడం లేదన్నారు.
లార్జ్, మిడ్-క్యాప్ ఐటీ కంపెనీల కంటే చిన్న ఐటీ కంపెనీలపై తాము సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాక్సెంచర్ ఆదాయాలు భారత ఐటీ రంగం ప్రస్తుతం వృద్ధి లేమిని సూచిస్తున్నాయన్నారు. ఐటీ కంపెనీల స్టాక్స్ను డివిడెండ్ కోసం కొనుగోలు చేయవచ్చు, కానీ వృద్ధి లేదు అన్నారు.
ఇదీ చదవండి: పసిడి ఆశలు ఆవిరి.. బంగారం ధరలు రివర్స్!