ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్‌ | tiktok founder zhang yiming overtakes mukesh ambani asia second richest billionaire | Sakshi
Sakshi News home page

ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్‌టాక్ ఫౌండర్‌

Jun 3 2026 5:30 PM | Updated on Jun 3 2026 6:05 PM

tiktok founder zhang yiming overtakes mukesh ambani asia second richest billionaire

చైనా టెక్ దిగ్గజం బైట్‌డాన్స్‌ (ByteDance) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) సంపద మరోసారి భారీగా పెరిగింది. ఫలితంగా ఆయన భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని (Mukesh Ambani)ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

తాజా బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్‌బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.

ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్‌టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన  డౌబావో (Doubao) ఏఐ చాట్‌బాట్‌కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్‌డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.

అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్‌డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్‌ను బ్లూమ్‌బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు బ్లాక్‌రాక్‌, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌, టి.రోవీ ప్రైజ్, జనరల్‌ అట్లాంటిక్‌, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం.

అగ్రస్థానంలో గౌతమ్‌ అదానీ

ఇక భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్‌ అదానీ (Gautam Adani) 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఏఐతో కొత్త శకానికి బైట్‌డాన్స్

సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్‌డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్‌టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement