రూ.20 లక్షలకే టెస్లా కారు! | Sakshi
Sakshi News home page

రూ.20 లక్షలకే టెస్లా కారు!

Published Mon, Jul 26 2021 7:23 PM

Tesla Plans To Make EVs With 4680 Battery Cells - Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా తన ప్రత్యర్డుల కంటే వేగంగా ప్రణాళికలు రచిస్తుంది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలను టెస్లా జరిపింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూసుకెళ్తున్న ఎలోన్ మస్క్ బ్యాటరీలు, కొత్త కర్మాగారాలు, కొత్త కార్ల నమూనాల పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గత కొద్ది నెలల నుంచి టెస్లా షేర్ విలువ పడిపోవడంతో పాటు మార్కెట్లోకి కొత్త పోటీదారులు దూసుకొనిరావడంతో టెస్లా విషయంలో పెట్టుబడుదారులు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానంగా గత సెప్టెంబర్లో ఎలోన్ మస్క్ కొత్త డిజైన్ తో తన స్వంత బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించారు. 

రాబోయే కొత్త తరం బ్యాటరీలు అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటాయి అని మస్క్ పేర్కొన్నారు. ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు వాహనాల తయారీ ఖర్చు తగ్గనున్నట్లు తెలిపారు. టెస్లా రాబోయే మూడు సంవత్సరాలలో $25,000 (సుమారు రూ.18 లక్షలు) కారును తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుంది అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త తరం 4680 బ్యాటరీలు ఎక్కువ మొత్తంలో తయారు చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న టెక్సాస్ కర్మాగారం నుంచి రాబోయే మోడల్ వైలో వాటిని ఉపయోగించనున్నట్లు ఆయన చెప్పారు.

ఇప్పుడు, 4680 బ్యాటరీలతో వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా టెస్లా పెట్టుకున్నట్లు ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తులు రాయిటర్స్ కు చెప్పారు. టెస్లా 4680 బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి పానాసోనిక్ తో కలిసి పనిచేయనున్నట్లు మస్క్ చెప్పారు. మరో టెస్లా సరఫరాదారుడు ఎల్‌జీ కంపెనీ 2023 నాటికి టెస్లా కోసం 4680 బ్యాటరీ సెల్స్ ను ఉత్పత్తి చేయడానికి కృషి చేస్తోందని రాయిటర్స్ ఇంతకు ముందు నివేదించింది.

Advertisement
Advertisement