
ముంబైలో తొలి షోరూమ్ ప్రారంభం
మోడల్ ‘వై’ని ప్రవేశపెట్టిన కంపెనీ
రేటు రూ. 59.89 లక్షల నుంచి మొదలు
ముంబై: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు.
టెస్లా భారత్‌లోనే పరిశోధనలు, తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఏపీఏసీ (ఏషియా పసిఫిక్) రీజియన్ చీఫ్ ఇసాబెల్ ఫాన్ తెలిపారు. ముంబై, ఢిల్లీలో 4 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
జర్మన్ కార్లతో పోటీ..
దేశీ మార్కెట్లో మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి జర్మన్ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లతో టెస్లా మోడల్ వై పోటీపడనుంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల కార్ల ధర రూ. 30 లక్షల లోపే ఉంటోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్ ప్రస్తుతం కార్ల దిగుమతులపై 70–100 శాతం వరకు సుంకాలు విధిస్తోంది.
వీటిని తగ్గించాలని కోరుతున్న టెస్లా, దేశంలో ముందుగా తమ కార్లను అమ్ముకునేందుకు, సర్విస్ చేసేందుకు అనుమతిస్తే, అమ్మకాలను బట్టి తయారీ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ టెస్లా చెబుతోంది. కానీ, ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేలా విధానాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్‌లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామనే హామీ ఇచ్చే కంపెనీలు 15 శాతం సుంకానికే ఏటా 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.
రెండు వేరియంట్లు..
మోడల్ వై రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజిని (మైలేజీ) ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ బేస్ ధర రూ. 59.89 లక్షలుగా ఉంటుంది. 622 కి.మీ. రేంజినిచ్చే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా ఉంటుంది. 2025 మూడో త్రైమాసికం లేదా నాలుగో త్రైమాసికం నుుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
దీన్ని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా చైనాలోని తమ ప్లాంటు నుంచి టెస్లా దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్‌లో డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టెస్లా డిజైన్ స్టూడియో ద్వారా వాహనం లోపల, వెలుపల, అలాగే ఫీచర్లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో టెస్లా వాహనాలకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్, ఎకో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు బీమా కవరేజీని అందిస్తాయి.
ధరలు ఇలా.. (కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం..)
⇒ మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్‌రోడ్ ధర
రూ. 61,07,190.
⇒ మోడల్ వై లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 67.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్‌రోడ్ ధర రూ. 69,15,190.
⇒ బుకింగ్ అమౌంట్ రూ. 22,220గా (నాన్–రిఫండబుల్) ఉంటుంది. తుది ధ్రువీకరణ కోసం ఏడు రోజుల్లోగా మరో రూ. 3 లక్షలు చెల్లించాలి.
⇒ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్‌ఎస్‌డీ) ఆప్షన్ కోసం అదనంగా రూ. 6 లక్షలు.
⇒ అమెరికాలో నగదు రూపంలో చెల్లిస్తే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 37,490 డాలర్లుగా (సుమారు రూ. 32.24 లక్షలు) ఉంది.
ప్రత్యేకతలు..
⇒ గంటకు 0 – 100 కి.మీ. వేగం 5.6 సెకన్లలో
⇒ వెనుక కూర్చునే వారి కోసం ఎనిమిది అంగుళాల స్క్రీన్, 9 స్పీకర్లు
⇒ టాప్ స్పీడ్ గంటకు 201 కి.మీ.
⇒ ఫాస్ట్ చార్జర్లతో 15 నిమిషాల్లో 267 కి.మీ. చార్జింగ్
⇒ వెలుపల ఎనిమిది కెమెరాలు
⇒ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్
⇒ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
⇒ రెండు వేరియంట్లు, ఆరు రంగుల్లో లభ్యం
⇒ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ చార్జర్