
త్వరలో కియోస్క్ ప్రారంభం
రెరా మొబైల్ యాప్ కూడా
గృహ కొనుగోలుదారులకు పారదర్శక, వేగవంతమైన సేవలు
ఇప్పటివరకు టీజీ రెరాలో 10,043 ప్రాజెక్ట్‌ల నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు పారదర్శక, వేగవంతమైన సేవలను అందించేందుకు సాంకేతికతను వినియోగించనుంది. ఇందులో భాగంగా టీజీ రెరా కార్యాలయంలో కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎలాగైతే బ్యాంకింగ్ రంగంలో కియోస్క్‌లు చిన్నపాటి బ్యాంక్ అవుట్‌లెట్ లాగా పనిచేస్తాయో.. అదే తరహాలో కస్టమర్లు టీజీ రెరా సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా పొందే వీలుంటుంది. గృహ కొనుగోలుదారులు టీజీ రెరా కార్యాలయాన్ని నేరుగా సందర్శించే అవసరం లేకుండా టీజీ రెరా (TG RERA) ప్రాథమిక సేవలన్నీ ఈ కియోస్క్ ద్వారా అందుకోవచ్చని ఓ టీజీ రెరా అధికారి తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో రెరా కియోస్క్ ఏర్పాటు చేసిన తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
టీజీ రెరా యాప్ కూడా..
టీజీ రెరా మొబైల్ అప్లికేషన్ (యాప్)ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఏప్రిల్‌లో యాప్ అందుబాటులోకి వస్తుందని ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని టీజీ రెరా అధికారులు నిర్ణయించారు. నిర్దిష్ట ప్రాజెక్ట్ సమాచారమంతా ఈ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది.
ప్రాజెక్ట్‌కు బయట వీక్షకులకు కనిపించేలా క్యూఆర్ కోడ్‌ను (QR Code) డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ప్రాజెక్ట్ డెవలపర్, ప్రమోటర్, అపార్ట్‌మెంట్ల సంఖ్య, అనుమతులు.. ఇలా ప్రాజెక్ట్ గురించి సమస్త సమాచారం ఇట్టే తెలిసిపోతుంది. డెవలపర్లు ప్రాజెక్ట్ ప్రమోషన్, అడ్వర్టయిజింగ్ సందర్భాలలో క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో 2023 ఆగస్టులో మహా రెరా ఈ క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టింది.
చదవండి: మా నాన్న మందుకొట్టి స్థలం అమ్మేశాడు.. న్యాయం చేయండి
10,043 ప్రాజెక్ట్‌ల నమోదు..
2017 జులైలో మొదలైన టీజీ రెరాలో ఇప్పటివరకు 10,043 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. 4463 మంది స్థిరాస్తి మధ్యవర్తులు, ఏజెంట్లు రిజిస్టరయ్యారు. అలాగే ఇప్పటివరకు టీజీ రెరాకు 2,340 ఫిర్యాదులు అందగా.. ఇందులో 1,566 ఫిర్యాదులను పరిష్కృతమయ్యాయి. సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్, జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వైవీఆర్ కన్‌స్ట్రక్షన్స్, సత్యనారాయణ మూల, శ్రీఅమేయా కన్‌స్ట్రక్షన్స్, శ్రీనివాస్ కాకర్ల ఏడుగురు ప్రమోటర్లు/ ఏజెంట్లను డిఫాల్టర్లుగా గుర్తించారు. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిరి్మంచే నివాస, వాణిజ్య ప్రాజెక్ట్‌లతో పాటు 8, అంతకంటే ఎక్కువ అపార్ట్‌మెంట్లు, నిర్మాణాలను టీజీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే.