80సి డిడక్షన్లు.. ట్యూషన్‌ ఫీజు.. | Tax Deduction on Tuition Fees under Section 80C | Sakshi
Sakshi News home page

పిల్లల చదువు ఖర్చుతో పన్ను ఆదా..

May 26 2025 9:52 AM | Updated on May 26 2025 9:57 AM

Tax Deduction on Tuition Fees under Section 80C

80సిలో 20 అంశాలు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్లు, కొన్ని సేవింగ్స్, కొన్ని ఖర్చులు, కొన్ని ఆస్తుల కొనుగోలుకు సంబంధించినవి వీటిలో ఉన్నాయి. వీటిలో ట్యూషన్‌ ఫీజు విషయానికొస్తే .. ఇది చాలా పెద్ద ఖర్చు. ప్రతి సంవత్సరం తప్పనిసరి. చాలా మంది తమ పిల్లలను చదివిస్తున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఈ అంశాన్ని చేర్చారు. చదువుకు ప్రాముఖ్యత ఇచ్చే తల్లిదండ్రులు, అలాగే ఈపీఎఫ్, జీపీఎఫ్‌ కంపల్సరీ కాని వర్గాలు (వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు, ఆర్టిస్టులు, కళాకారులు.. ఇలా సొంత కాళ్ల మీద నిలబడేవారికి) పిల్లల చదువు కోసం చేసే ఖర్చుతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు.  


ఇద్దరు పిల్లల చదువు కోసం చెల్లించే ఫీజుకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ముగ్గురు లేదా నలుగురు పిల్లలున్న పక్షంలో ట్యాక్స్‌ ప్లానింగ్‌లో భాగంగా ఇద్దరి ఖర్చును తల్లిదండ్రుల్లో ఒకరు, మిగతా వారి ఖర్చును మరొకరు చూపించి, మినహాయింపును పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా లేక ఈపీఎఫ్‌ కంపల్సరీగా ఉండే ఉద్యోగం చేస్తున్నా .. ఈ అంశం వల్ల అదనంగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా చెల్లించే ఈపీఎఫ్, జీపీఎఫ్‌ల మొత్తం ఒక్కొక్కరికి రూ. 1,50,000 దాటితే, స్కూల్‌ ఫీజుల మినహాయింపులపరంగా ఎటువంటి ప్రయోజనం దక్కదు. అయితే, స్థూలపరిమితి అయిన రూ. 1,50,000 నుంచి పీఎఫ్‌ నిమిత్తం వార్షికంగా పోతున్న మొత్తాన్ని తీసివేయగా, ఏదైనా మిగిలితే, దానికి స్కూల్‌ ఫీజు కింద మినహాయింపు పొందవచ్చు. ఈ కింది ఉదాహరణలు గమనించండి.. 
 

🔸    రత్నాకర్, అతని భార్య.. ఇద్దరిదీ ప్రైవేట్‌ ప్రాక్టీసు. ఈపీఎఫ్, జీపీఎఫ్‌ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న ఇద్దరు పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. ఫీజులు భారీగానే కడతారు. ఇద్దరూ అస్సెస్సీలే. ఒకరి అసెస్‌మెంట్‌లో అబ్బాయి స్కూల్‌ ఫీజును, మరొకరి అసెస్‌మెంట్‌లో అమ్మాయి స్కూల్‌ ఫీజును చూపించి మినహాయింపు పొందుతారు. 
🔸    విజయకిరణ్‌కి కన్సల్టెన్సీ సంస్థ ఉంది. భార్య సింధు వ్యాపారం చేస్తుంది. ఒక్కడే కొడుకు. స్కూల్‌ ఫీజు భారీగానే ఉంటుంది. భార్యకి సంబంధించిన ఇన్‌కం ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌లో కొడుకు స్కూల్‌ ఫీజును క్లెయిమ్‌ చేశారు. విజయకిరణ్‌ కూడా తన ఇన్‌కం ట్యాక్స్‌ అసెస్‌మెంట్‌లో కొడుకు స్కూల్‌ ఫీజును క్లెయిమ్‌ చేస్తాడు. చట్టంలో స్పష్టత లేనందున ఇద్దరూ ఒకే సంతానం మీద చెల్లించే స్కూల్‌ ఫీజుకి మినహాయింపు పొందుతున్నారు.  
🔸   కుటుంబరావుగారు, ఆయన భార్య సంతానానికి గంపెడు పిల్లలేమీ లేరు. కానీ రెండు సార్లు కవలలు కా>వడంతో.. మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన లంకంత ఇల్లు ఉంది. ఇద్దరూ లాయర్లుగా బాగా సంపాదిస్తున్నారు. భర్త తన అసెస్‌మెంట్‌లో ఇద్దరు పిల్లల ఫీజులను, భార్య తన అసెస్‌మెంట్‌లో మిగతా ఇద్దరి పిల్లల ఫీజులను క్లెయిమ్‌ చేస్తారు.  
🔸    అనంత మూర్తి, భార్య శారద.. ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. ఒక్కర్తే ఆడపిల్ల. ఒకరి అసెస్‌మెంట్‌లో పిల్ల స్కూల్‌ ఫీజును క్లెయిమ్‌ చేస్తారు. మరొకరు కూడా క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా.. ఈపీఎఫ్, వీపీఎఫ్‌లో జమ చేస్తారు. 
🔸    గురునాధ్, సావిత్రికి ముగ్గురు పిల్లలు. గురునాధ్‌ ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్‌ చేస్తారు. సావిత్రి బొటిక్‌ నడిపిస్తుంది. తన అసెస్‌మెంట్‌లో మూడో సంతానం చదువులకయ్యే ఫీజులను క్లెయిమ్‌ చేస్తోంది. 
పాత కాలంలోలాగా గంపెడు పిల్లలు ఉంటే ఏం చేయలేం కానీ.. నలుగురి వరకు స్కూల్‌ ఫీజులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ట్యూషన్‌ ఫీజుల మీద మినహాయింపు వస్తుంది. డొనేషన్లు, క్యాపిటేషన్, డెవలప్‌మెంట్‌ నిమిత్తం ఇస్తే ఎలాంటి మినహాయింపు రాదు.  

ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది. మీకు ఏది సూట్‌ అవుతుంది. ఏది అనుకూలంగా ఉంటుందో అది చేయండి. ఏదైనా చట్టానికి లోబడి చేయాలి సుమా!! 

 

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.  

Advertisement
 
Advertisement
Advertisement