స్థిరాస్తిని కొన్న ధరని కొనుగోలు ధర అంటారు. అమ్మిన ధరలో నుంచి కొనుగోలు ధరని తీసివేస్తే మూలధన లాభం. అయితే, కొనుగోలు ధర అనే అంశం మీద ఎంతో వివరణ ఉందని చెప్పాలి. ఆంగ్లంలో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని అంటే ఎంతో బాగా అర్థం అవుతుంది. ఈ వారం మనం ‘కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్‘ గురించి, కేవలం స్థిరాస్తుల గురించి తెలుసుకుందాం.
కట్టిన ఇల్లు, జాగా ధర.. కేవలం డీడ్‌లో పొందుపర్చిన ధర.. మీకు తెలియనిదేముంది. అంతకు అంతా మీరు బ్లాక్‌లో ఇచ్చి ఉండొచ్చు. అదంతా నల్లధనం, తెరచాటు వ్యవహారం కదా. వాటన్నింటినీ కాగితాల్లో ప్రస్తావించరు కదా. చాలా మంది బ్లాక్, వైట్ కలిపి చెప్తారు. కానీ కాగితాలకే విలువ ఎక్కువ. ఆ జాగా మీద ఇల్లు కట్టి ఉండొచ్చు. అన్ని ఖర్చుల వివరాలు, కాగితాలు ఉండాలి. జాగా రిజిస్ట్రేషన్ సందర్భంలో సర్కారు వారికి రాతపూర్వకంగా చలాన్ల ద్వారా చెల్లించే ఫీజులను కలపవచ్చు. ఇక ఫ్లాట్‌లో ప్రత్యేకంగా లాండ్ ఉండకపోవచ్చు. కానీ, ఉమ్మడి వాటాగా వచ్చే 40, 50, 60 గజాలు .. ప్లాట్ విస్తీర్ణం అడుగుల్లో ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ చెల్లించడానికి సెమీ ఫినిష్డ్‌గా రిజిస్ట్రేషన్ చేయించే వారు. మిగతా మొత్తం వర్క్ ఆర్డరు రూపంలో ఉండేది. ఈ రెండింటితో పాటు సర్కారు వారికి ఇచ్చిన చలానాలు కలిపితే పూర్తి మొత్తం వస్తుంది.
కొన్ని తీర్పులు, వివరణల ప్రకారం ఈ కింది విషయాలు ముఖ్యమైనవి.
🔸 1. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఫీజులు కాకుండా మిగతావాటిని ఖర్చుగా భావించరు.
🔸 2. ఏవైనా అద్దెలు చెల్లించినా ఖర్చుగా భావించరు.
🔸 3. రసీదులు, వివరాలు లేని బ్రోకరేజీని పరిగణనలోకి తీసుకోరు.
🔸 4. బ్రోకరేజీని చెల్లించి, టీడీఎస్‌ని రికవర్ చేసి రసీదులు చూపిస్తే, ఖర్చుగా భావిస్తారు.
🔸 5. స్టాంప్ డ్యూటీని ఖర్చుగా భావిస్తారు.
🔸 6. టైటిల్ కోసం అయిన లీగల్ వ్యయాలు ఖర్చు కిందికి వస్తాయి.
🔸 7. లోన్ మీద వడ్డీ .. ఖర్చు కాదు.
🔸 8. సొసైటీకి, బిల్డర్‌కి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు చెల్లించే బదిలీ ఖర్చులు
🔸 9. ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఖర్చులు
🔸 10. కడుతున్న ప్లాట్ అయితే జీఎస్‌టీ
🔸 11. ఆర్కిటెక్ట్ ఫీజులు.. ప్లాన్ అప్రూవర్ ఫీజు
🔸 12. సిమెంటు, స్టీలు, ఇటిక, రాయి, ఇసుక మొదలైన వాటికి బిల్లులు ఉండాలి.
🔸 13. లేబర్ చెల్లింపులు / కాంట్రాక్టరు చెల్లింపులు .. బ్యాంకు ద్వారా చెల్లించాలి. లేకపోతే నమ్మరు.
🔸 14. బోర్‌వెల్, కాంపౌండ్ గోడ ఖర్చులు
🔸 15. భూమి చదును చేసినందుకు (లెవెలింగ్) ఖర్చులు
🔸 16. కరెంటు, వాటర్ కనెక్షన్ నిమిత్తం ఇచ్చినవి
🔸 17. అదనపు నిర్మాణంలో గదుల నిర్మాణం, ప్లాన్ అప్రూవల్
🔸 18. ఇంటి పెయింటింగ్, రిపేరు ఖర్చులను ఒప్పుకోరు
🔸 19. మున్సిపల్ పన్నులు, కరెంటు, వాటర్ బిల్లులు ఒప్పుకోరు
🔸 20. చట్టప్రకారం చెల్లించిన పెనాల్టీలను పరిగణించరు.
🔸 ఇలాగే ఉంటుంది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ వరస కూడా.
వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు/బహుమతిగా వచ్చిన ఇంటికి సంబంధించి .. ఒరిజినల్ ఓనర్‌కి అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంప్రూవ్ చేస్తే ఆ ఖర్చును తీసుకుంటారు.
చివరగా 2001 ఏప్రిల్ 1కి ముందు ఏర్పడ్డ ఆస్తి అయితే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ విలువ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ధృవీకరణ ఉండాలి. ఆ తర్వాత ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చు.
ప్రతి దానికి లెక్క, వివరణ, కాగితాలు ఉండాలి. పాతదే కదా.. ఎవరూ అడగరు అని లేనిపోని, పొంతన లేని ఖర్చులు చూపించకండి.


