breaking news
cost of
-
Income Tax: ప్రాపర్టీ కొనుగోలు ధర అంటే..
స్థిరాస్తిని కొన్న ధరని కొనుగోలు ధర అంటారు. అమ్మిన ధరలో నుంచి కొనుగోలు ధరని తీసివేస్తే మూలధన లాభం. అయితే, కొనుగోలు ధర అనే అంశం మీద ఎంతో వివరణ ఉందని చెప్పాలి. ఆంగ్లంలో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని అంటే ఎంతో బాగా అర్థం అవుతుంది. ఈ వారం మనం ‘కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్‘ గురించి, కేవలం స్థిరాస్తుల గురించి తెలుసుకుందాం.కట్టిన ఇల్లు, జాగా ధర.. కేవలం డీడ్‌లో పొందుపర్చిన ధర.. మీకు తెలియనిదేముంది. అంతకు అంతా మీరు బ్లాక్‌లో ఇచ్చి ఉండొచ్చు. అదంతా నల్లధనం, తెరచాటు వ్యవహారం కదా. వాటన్నింటినీ కాగితాల్లో ప్రస్తావించరు కదా. చాలా మంది బ్లాక్, వైట్ కలిపి చెప్తారు. కానీ కాగితాలకే విలువ ఎక్కువ. ఆ జాగా మీద ఇల్లు కట్టి ఉండొచ్చు. అన్ని ఖర్చుల వివరాలు, కాగితాలు ఉండాలి. జాగా రిజిస్ట్రేషన్ సందర్భంలో సర్కారు వారికి రాతపూర్వకంగా చలాన్ల ద్వారా చెల్లించే ఫీజులను కలపవచ్చు. ఇక ఫ్లాట్‌లో ప్రత్యేకంగా లాండ్ ఉండకపోవచ్చు. కానీ, ఉమ్మడి వాటాగా వచ్చే 40, 50, 60 గజాలు .. ప్లాట్ విస్తీర్ణం అడుగుల్లో ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ చెల్లించడానికి సెమీ ఫినిష్డ్గా రిజిస్ట్రేషన్ చేయించే వారు. మిగతా మొత్తం వర్క్ ఆర్డరు రూపంలో ఉండేది. ఈ రెండింటితో పాటు సర్కారు వారికి ఇచ్చిన చలానాలు కలిపితే పూర్తి మొత్తం వస్తుంది.కొన్ని తీర్పులు, వివరణల ప్రకారం ఈ కింది విషయాలు ముఖ్యమైనవి. 🔸 1. రిజిస్ట్రేషన్ సందర్భంలో ఫీజులు కాకుండా మిగతావాటిని ఖర్చుగా భావించరు. 🔸 2. ఏవైనా అద్దెలు చెల్లించినా ఖర్చుగా భావించరు. 🔸 3. రసీదులు, వివరాలు లేని బ్రోకరేజీని పరిగణనలోకి తీసుకోరు. 🔸 4. బ్రోకరేజీని చెల్లించి, టీడీఎస్‌ని రికవర్ చేసి రసీదులు చూపిస్తే, ఖర్చుగా భావిస్తారు. 🔸 5. స్టాంప్ డ్యూటీని ఖర్చుగా భావిస్తారు. 🔸 6. టైటిల్ కోసం అయిన లీగల్ వ్యయాలు ఖర్చు కిందికి వస్తాయి. 🔸 7. లోన్ మీద వడ్డీ .. ఖర్చు కాదు. 🔸 8. సొసైటీకి, బిల్డర్‌కి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు చెల్లించే బదిలీ ఖర్చులు 🔸 9. ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఖర్చులు 🔸 10. కడుతున్న ప్లాట్ అయితే జీఎస్టీ 🔸 11. ఆర్కిటెక్ట్ ఫీజులు.. ప్లాన్ అప్రూవర్ ఫీజు 🔸 12. సిమెంటు, స్టీలు, ఇటిక, రాయి, ఇసుక మొదలైన వాటికి బిల్లులు ఉండాలి. 🔸 13. లేబర్ చెల్లింపులు / కాంట్రాక్టరు చెల్లింపులు .. బ్యాంకు ద్వారా చెల్లించాలి. లేకపోతే నమ్మరు. 🔸 14. బోర్వెల్, కాంపౌండ్ గోడ ఖర్చులు 🔸 15. భూమి చదును చేసినందుకు (లెవెలింగ్) ఖర్చులు 🔸 16. కరెంటు, వాటర్ కనెక్షన్ నిమిత్తం ఇచ్చినవి 🔸 17. అదనపు నిర్మాణంలో గదుల నిర్మాణం, ప్లాన్ అప్రూవల్ 🔸 18. ఇంటి పెయింటింగ్, రిపేరు ఖర్చులను ఒప్పుకోరు 🔸 19. మున్సిపల్ పన్నులు, కరెంటు, వాటర్ బిల్లులు ఒప్పుకోరు 🔸 20. చట్టప్రకారం చెల్లించిన పెనాల్టీలను పరిగణించరు. 🔸 ఇలాగే ఉంటుంది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ వరస కూడా.వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు/బహుమతిగా వచ్చిన ఇంటికి సంబంధించి .. ఒరిజినల్ ఓనర్‌కి అయిన ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంప్రూవ్ చేస్తే ఆ ఖర్చును తీసుకుంటారు.చివరగా 2001 ఏప్రిల్ 1కి ముందు ఏర్పడ్డ ఆస్తి అయితే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ విలువ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ధృవీకరణ ఉండాలి. ఆ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు.ప్రతి దానికి లెక్క, వివరణ, కాగితాలు ఉండాలి. పాతదే కదా.. ఎవరూ అడగరు అని లేనిపోని, పొంతన లేని ఖర్చులు చూపించకండి. -
ప్రారంభానికి ముందే పగుళ్లు!
ఐటీడీఏలో నాసిరకం పనులు పెచ్చులూడుతున్న హాస్టల్ భవనాలు చినుకుపడితే చెమ్మ వస్తున్న పైకప్పు మరో పూత వేస్తామంటున్న ఏఈ సాక్షి, హన్మకొండ : గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)తో గిరిజనుల కంటే ఐటీడీఏ అధికారులు, కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతున్నారు. కాగితాలపై గిరిజన సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తున్నా వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇందుకు ములుగు మండలం జాకారంలో నిర్మాణంలో ఉన్న బాలురు, బాలికల హాస్టల్ భవనాలే ఉదాహరణగా నిలుస్తాయని చెప్పవచ్చు. విద్య ద్వారానే గిరిజనుల్లో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని.. ఐటీడీఏ కోట్లాది రూపాయలు గిరిజనుల చదువు కోసం వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా ములుగు మండలం జాకారంలో ఒక్కొక్కటి కోటి రూపాయల వ్యయంతో బాలికలు, బాలురులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. గత ఏప్రిల్ ఈ భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా ప్రతీ పనిని నాసిరకంగానే చేపడుతున్నారు. నిర్మాణం పూర్తికావొచ్చిన ఈ భవనాలను ఉపయోగించకముందే పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి, గోడలకు పగళ్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, డాబాకు నీటి చెమ్మలు వచ్చాయి. ఈ భవన నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు నాసిరకంగా చేపట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పనులు నాసిరకంగా జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సి ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఎంతో నాణ్యతతో కూడుకున్నవని కితాబిస్తున్నారు. పైగా భవనానికి వచ్చిన పగుళ్లు, డాబా పెచ్చులు ఊడి పోవడం వంటిని సాధరణంగా జరిగేవే అంటూ నాసిరకం ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఏఈ జన్నపురెడ్డి రాంరెడ్డి మంగళవారం జాకారం వచ్చారు. ఈ సందర్భంగా నాసిరకం పనులపై ఆయనను ప్రశ్నించగా ‘పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. ఆ పని జరిగిన తర్వాత ఈ పగుళ్లు కనిపించవు’ అని సమాధానం ఇచ్చారు. రెండేళ్లుగా నిర్మాణం.. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్-2 పథకం కింద 2012-13 సంవత్సరంలో రూ. కోటి అంచనా వ్యయంతో బాలికలు, బాలురకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ మంజూరైంది. అయితే రెండేళ్ల నుంచి ఈ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ విద్యాసంవత్సర ప్రారంభమై మూడు నెలలు కావోస్తున్నా ఇంత వరకు పూర్తికాలేదు. దానితో హాస్టల్ సౌకర్యం లేక ఏజెన్సీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి రూ. కోటితో గర్ల్స్ హాస్టల్, రూ. కోటితో బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత వేసవిలో పనులను ప్రారంభించాం. పనుల ను నిభందనలకు అనుగుణంగా నాణ్యతాగానే చేపడుతున్నాం. పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. వేసిన తరువాత ఆ పగ్గుళ్ళు కనిపించవు. ఎప్పటికి అప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. నెల రోజుల్లో పనులు పూర్తిచేసి అప్పగిస్తాం. - జన్నపురెడ్డి రాంరెడ్డి, ఐటీడీఏ ఏఈ


