న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 14 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ. 13.38 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఇదే వ్యవధితో పోలిస్తే 13 శాతం వృద్ధి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 50 శాతం. కార్పొరేట్యేతర పన్ను చెల్లింపుదారులకు రిఫండ్లు 67 శాతం పెరిగినప్పటికీ, కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 20.58 శాతం పెరగడంతో ఇది సాధ్యపడింది.
కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) డేటా ప్రకారం సమీక్షాకాలంలో నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 5.99 లక్షల కోట్లకు చేరగా, కార్పొరేట్యేతర ట్యాక్స్లు 5.83 శాతం పెరిగి రూ. 6.92 లక్షల కోట్లకు చేరాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) ద్వారా రూ. 73,700 కోట్ల లక్ష్యం నిర్దేశించుకోగా, ప్రస్తుతం వసూళ్లు 52 శాతం ఎగిసి రూ. 46,840 కోట్లకు చేరాయి.


