
ఇండియన్ హోటల్స్, అపోలో హాస్పిటల్స్, లుపిన్
లార్జ్‌క్యాప్ నుంచి ఇంతే మేర మిడ్‌క్యాప్ విభాగంలోకి
మిడ్‌క్యాప్‌లోకి తొమ్మిది స్మాల్‌క్యాప్ కంపెనీలు
నువమా క్వాంటిటేటివ్ రీసెర్చ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో కంపెనీలకు స్థానచలనం చోటుచేసుకోనుంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పరంగా సవరించిన జాబితాను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. ఈ సందర్భంగా ఇండియన్ హోటల్స్, సోలార్ ఇండస్ట్రీస్, మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు మిడ్‌క్యాప్ నుంచి లార్జ్‌క్యాప్ విభాగం కిందకు రానున్నాయి.
సీమెన్స్ ఎనర్జీ నేరుగా లార్జ్‌క్యాప్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో లార్జ్‌క్యాప్ విభా గం నుంచి మిడ్‌క్యాప్ కిందకు రైల్ వికాస్ నిగమ్ (ఆర్‌వీఎన్‌ఎల్), హీరో మోటోకార్ప్, స్విగ్గీ, పాలీ క్యాబ్ ఇలా 11 కంపెనీలు చేరనున్నాయి. దీనిపై నువమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసింది. 9 స్మాల్ క్యాప్ కంపెనీలు మిడ్‌క్యాప్ విభాగం కిందకు అప్‌గ్రేడ్ కానున్నాయి. అలాగే, మిడ్‌క్యాప్ కిందకు కొ త్తగా హెక్సావేర్ టెక్నాలజీస్, ఐటీసీ హోటల్స్ చేరనున్నాయి.
ఇవి ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ కావడం గమనార్హం. ఏటా జనవరి, జూలైలో యాంఫి (ప్రతి 6 నెలలకు ఒకసారి) కంపెనీల మార్కెట్ విలువ ఆధారంగా జాబితాను ప్రకటిస్తుంటుంది. ఫిబ్రవరి1, ఆగస్ట్ 1 నుంచి మార్పులు అమల్లోకి వస్తాయి. యాంఫి వర్గీకరణకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడుల కోసం స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, స్మాల్‌క్యాప్, మలీ్టక్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఈ వర్గీకర జాబితాకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులూ చేస్తుంటాయి. కనుక ఫండ్స్ పెట్టుబడులకు ఈ జాబితా కీలకంగా పనిచేస్తుంటుంది. ఫండ్స్ పెట్టుబడులకు అనుగుణంగా ఆయా స్టాక్స్ ధరల్లోనూ మార్పులు చూడొచ్చు.
మిడ్‌క్యాప్ నుంచి లార్జ్‌క్యాప్ విభాగంలోకి
ఇండియన్ హోటల్స్
సోలార్ ఇండస్ట్రీస్
మజ్‌గాన్ షిప్ బిల్డర్స్
మ్యాక్స్ హెల్త్‌కేర్
శ్రీ సిమెంట్స్
మ్యాన్‌కైండ్ ఫార్మా
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
లుపిన్
జిందాల్ స్టీల్ అండ్ పవర్
సీమెన్స్ ఎనర్జీ (కొత్త చేరిక)
లార్జ్ క్యాప్ నుంచి మిడ్‌క్యాప్ విభాగంలోకి
ఆర్‌వీఎన్‌ఎల్
హీరో మోటోకార్ప్
ఇండియన్ ఓవర్సీ బ్యాంక్
కమిన్స్ ఇండియా
స్విగ్గీ
పాలీక్యాబ్ ఇండియా
బోష్ లిమిటెడ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్
డాబర్ ఇండియా
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
ఎన్‌టీపీసీ గ్రీన్
మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింపు
మార్కెట్ విలువ పరంగా టాప్–100 కంపెనీలు లార్జ్‌క్యాప్ కిందకు వస్తాయి. మార్కెట్ విలువ పరంగా 101 నుంచి 250 వరకు మొత్తం 150 కంపెనీలు మిడ్‌క్యాప్ కిందకు పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలినవి స్మాల్‌క్యాప్ కిందకు వస్తాయి. గత ఆరు నెలల కాలంలో స్టాక్ వారీ సగటు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు.
‘‘గత ఆరు నెలల్లో మార్కెట్ ఎంతో అస్థితరలను చూసింది. దీంతో 2024 డిసెంబర్ నుంచి చూస్తే మార్కెట్ విలువ కటాఫ్ తగ్గింది. లార్జ్‌క్యాప్ విభాగం కటాఫ్ విలువ 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.లక్ష కోట్లు నుంచి రూ.91,600 కోట్లకు దిగొచి్చంది. మిడ్‌క్యాప్ విభాగం కటాఫ్ (గరిష్ట విలువ) సైతం రూ.33,200 కోట్ల నుంచి రూ.30,800 కోట్లకు తగ్గింది’’అని నువమా నివేదిక తెలిపింది. గత నాలుగేళ్లలో లార్జ్‌క్యాప్ విభాగం కటాఫ్ విలువ గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి. స్టాక్స్ విలువలు దిద్దుబాటునకు గురి కావడమే ఇందుకు దారితీసింది.