
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులూ కీలకమే...
క్యూ4 ఫలితాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి...
అమెరికాతో వాణిజ్య ఒప్పందాల చర్చల ప్రభావం
ఈ వారం మార్కెట్ గమనంపై విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.
’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్‌లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు.
దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.
కీలక ఫలితాలు...
ఈ వారంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్‌లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్‌పై అప్‌డేట్‌లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
గతవారం ఇలా..
విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.
విదేశీ ఇన్వెస్టర్ల క్యూ...
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్‌లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది.