రూ.2.19 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

Stock Market Index Surged Investors Wealth Increased - Sakshi

సూచీలకు గణాంకాల జోష్‌ 

ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు  

కలిసొచ్చిన రూపాయి రికవరీ ర్యాలీ 

సెన్సెక్స్‌ లాభం 620 పాయింట్లు 

184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ   

ఫార్మా షేర్లకు మాత్రమే నష్టాలు    

ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్‌ సూచీలకు లాభాలొచ్చాయి. దేశీయ ఆర్థిక గణాంకాలు, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి అనూహ్య రికవరీ కూడా కలిసొచ్చింది. ఇన్వెస్టర్లు ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలను విస్మరిస్తూ కొనుగోళ్లకు కట్టుబడటంతో బుధవారం సెన్సెక్స్‌ 620 పాయింట్లు పెరిగి 57,685 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 17,167 వద్ద నిలిచింది. కనిష్ట స్థాయిల వద్ద బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నవంబర్‌ నెల వాహన విక్రయాల గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో  ఆటో షేర్లు దూసుకెళ్లాయి. గడిచిన మూడు సెషన్లలో కరిగిపోయిన మెటల్‌ షేర్లు మెరిశాయి. రిలయన్స్‌ షేరు రెండున్నర శాతం రాణించి ఇంధన షేర్లను ముందుండి నడిపించింది. ఇటీవల అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా దూసుకెళ్లాయి. అయితే ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లలో ఎనిమిది మాత్రమే నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 781 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,766 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.3,467 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌లో రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని 22 పైసలు బలపడి 74.91 వద్ద స్థిరపడింది. సూచీల భారీ ర్యాలీతో బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో రూ.2.19 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.259 లక్షల కోట్లకు చేరింది. 
ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా...  
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 301 పాయింట్ల లాభంతో 57065 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 17104 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 781 పాయింట్లు ఎగసి 57846 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు ర్యాలీ చేసి 17,213 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. 
మెప్పించిన స్థూల ఆర్థిక గణాంకాలు...  
అంచనాలను మించుతూ భారత్‌ జీడీపీ సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8.4% వృద్ధి చెందింది. 8 కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి  అక్టోబర్‌లో 7.5%గా నమోదైంది. వరుసగా ఐదో నెలలోనూ జీఎస్‌టీ రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించించాయి. నవంబర్‌లో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. గణాంకాలు మెప్పించడం మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top