స్టాక్‌ మార్కెట్‌: 3 నెలల కనిష్టానికి సూచీలు

Stock Market Highlights: Nifty Settles Below 17610, Sensex Tanks 870 Pts - Sakshi

మార్కెట్‌పై అదానీ గ్రూప్‌ షేర్ల అమ్మకాల ఒత్తిడి

ప్రీ బడ్జెట్, వారాంతాపు అప్రమత్తత

సెన్సెక్స్‌ 874 పాయింట్లు క్రాష్‌

287 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ

బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లలో విక్రయాల వెల్లువ

ముంబై: స్టాక్‌ మార్కెట్లో రెండోరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రూప్‌ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ నివేదిక మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. టీప్లస్‌1 సెటిల్‌మెంట్‌ ట్రేడింగ్‌ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చేవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కూడా జరగనుంది. ఈ పరిణామాణాలకు తోడు వారాంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. బాండ్లపై రాబడుల పెరుగుదల, క్రూడాయిల్‌ ధరల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.

బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్‌ రంగ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్‌ 874 పాయింట్లు నష్టపోయి 59,307 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 287 పాయింట్లు క్షీణించి 17,604 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడు నెలల కనిష్ట ముగింపు. అదానీ గ్రూప్‌ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్‌బర్గ్‌ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ రెండుశాతం, మిడ్‌క్యాప్‌ సూచీ 1.30% నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,978 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.4,252 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది.  

ఇంట్రాడేలో రెండు శాతం క్రాష్‌  
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ..., రిపబ్లిక్‌ డే సెలవు రోజు తర్వాత దేశీయ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 60,167 వద్ద, నిప్టీ 15 పాయింట్ల పతనంతో 17,877 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత అమ్మకాల వెల్లువతో ఒక దశలో సెన్సెక్స్‌ 1,231 పాయింట్లకు పైగా నష్టపోయి 58,975 దగ్గర, నిఫ్టీ 398 పాయింట్లు క్షీణించి 17,494 వద్ద ఇంట్రాడే  కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి.  

రెండు రోజుల్లో రూ.10.65 లక్షల కోట్ల నష్టం 
గత రెండురోజుల్లో సెన్సెక్స్‌ 1,648 పాయింట్ల పతనంతో బీఎస్‌ఈలో 10.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. నిఫ్టీ సైతం 514 పాయింట్లు క్షీణించింది.   

అదానీ గ్రూప్‌ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఇచ్చిన వివరణ, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది. ఈ గ్రూప్‌నకు చెందిన మొత్తం ఏడు కంపెనీల్లో అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 20% లోయర్‌ సర్క్యూట్, అదానీ విల్మార్, అదానీ పవర్‌ షేర్లు ఐదుశాతం లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాకయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్‌ షేర్లు వరుసగా 18%, 16% చొప్పున నష్టపోయాయి.  ఇటీవల అదానీ గ్రూప్‌ విలీనం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్‌ కంపెనీల షేర్లు సైతం 17%, 13% చొప్పున నష్టపోయాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ నివేదిక నేపథ్యంలో గడిచిన రెండు రోజుల్లో అదానీ గ్రూప్‌ సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సుమారు రూ.4.17 లక్షల కోట్లు హరించుకుపోయింది.  

ఎఫ్‌పీవోకు బిడ్స్‌ 
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోకు తొలి రోజు(27న) రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 4.7 లక్షల బిడ్స్‌ దాఖలయ్యాయి. 4.55 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసింది. ఆఫర్‌కు ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. గడువు ఈ నెల 31న(మంగళవారం) ముగియనుంది. బీఎస్‌ఈలో షేరు 19 శాతం పతనమై రూ. 2,762 వద్ద ముగిసింది. చిన్న ఇన్వెస్టర్లకు కేటాయించిన 2.29 కోట్ల షేర్లకుగాను 4 లక్షల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్విబ్‌ విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయగా.. 2,656 షేర్లకు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 96.16 లక్షల షేర్లకుగాను 60,456 షేర్ల కోసం బిడ్స్‌ లభించాయి. బుధవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top