
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం వృద్ధితో రూ. 342 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,621 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు ఎగసింది.
వాటాదారులకు బ్యాంక్ బోర్డు షేరుకి రూ. 0.4 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 1,303 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,070 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్‌ఈలో 4 శాతం ఎగసి రూ. 28 వద్ద ముగిసింది.