చైనాలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే భారీ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు 109 డాలర్లకుపైన ట్రేడ్ అవుతుండగా, ఒక్కరోజులోనే 3 శాతం పెరిగింది. 2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు 44 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో ఈ పెరుగుదల 250 శాతాన్ని దాటింది. అయితే చైనాలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. అక్కడ వెండి ప్రీమియం కారణంగా స్థానిక ధరలు ఔన్సుకు సుమారు 125 డాలర్ల వరకు చేరాయి.
భారత్–చైనా వెండి ధరల తేడా
వెండి ధరలు ఆల్‌టైమ్ హై వద్ద ఉన్నాయి. భారత్‌లో వెండి ధర గ్రాముకు సుమారు రూ.3.35గా ఉంది. చైనాతో పోలిస్తే ఇది సుమారు 17% తక్కువ. వివరంగా చూస్తే.. 1 ఔన్సు అంటే సుమారు 28.3 గ్రాములు. భారత్‌లో 1 ఔన్సు వెండి ధర సుమార రూ.9,984. అదే చైనాలో 1 ఔన్సు వెండి ధర 125 డాలర్లు.. భారత కరెన్సీలో రూ.11,450. అంటే భారత్–చైనా మధ్య ఒక్క ఔన్సుపై సుమారు రూ.1,969 (17%) ధర వ్యత్యాసం ఉంది.
ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి?
చైనాలో వెండికి భారీ డిమాండ్ ఉండటంతో పాటు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఈ ధర వ్యత్యాసాన్ని మరింత పెంచుతున్నాయి. వెండి బుల్ రన్ వెనుక ప్రధాన కారణాల్లో ఒకటి ప్రపంచ సరఫరా పరిమితులు. దీనికి తోడు, చైనా 2026 నుంచి వెండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇకపై వెండి ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు అవసరం. ఈ విధానం 2027 వరకు అమల్లో ఉండనుంది.
ఈ ఆంక్షలు ప్రకటించిన సమయంలో, ఎలాన్ మస్క్ కూడా స్పందిస్తూ, “ఇది మంచిది కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి అత్యవసరం” అని హెచ్చరించారు. ప్రస్తుతం వెండి ఇప్పటికే సరఫరా కొరతను ఎదుర్కొంటోంది. ఇప్పుడు చైనా ఎగుమతులను పరిమితం చేయడంతో, ధరల అస్థిరత మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రపంచ వెండి మార్కెట్లో చైనా పాత్ర
ప్రపంచ వెండి సరఫరాలో చైనా వాటా సుమారు 65%. సిల్వర్ ఫ్యూచర్స్, భౌతిక పెట్టుబడులు, పేపర్ ట్రేడింగ్‌లో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. రెండవ అతిపెద్ద వెండి ఫ్యాబ్రికేటర్ కూడా చైనానే. చైనా ఎగుమతి పరిమితులు కొనసాగితే, ప్రపంచ సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, గత ఐదేళ్లుగా వెండి మార్కెట్లో నిర్మాణాత్మక లోటు కొనసాగుతోంది. అంటే డిమాండ్ ఎప్పటికప్పుడు సరఫరాను మించిపోతూనే ఉంది.
చైనాలో కొత్త నిబంధనలు
జనవరి 1, 2026 నుంచి వెండి ఎగుమతిదారులు తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్సులు పొందాలి. కఠినమైన ఉత్పత్తి, ఆర్థిక ప్రమాణాలు పాటించే పెద్ద, ప్రభుత్వ-ఆమోదిత సంస్థలకే లైసెన్సులు ఇస్తున్నారు. చిన్న ఎగుమతిదారులు మార్కెట్ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చైనా వెండి లభ్యత మరింత తగ్గే అవకాశముంది.


