
సాక్షి, సిటీబ్యూరో: పొరపాటున సాకెట్‌లో వేలు పెడితే ఏమవుతుంది? దిమ్మతిరిగి.. మైండ్ బ్లాక్ అవుతుందా లేదా! అదేనండి.. షాక్ కొడుతుంది కదా! వంటగదిలోని పవర్ సాకెట్ అదీ.. రెండు, మూడు ప్లగుల్ని పెడితే చిటపట మెరుపులు.. షార్టుసర్క్యూట్లు. ఇలాంటి సమస్యలన్నింటికీ ఓ చక్కటి పరిష్కారం పవర్ ట్రాక్. ఎక్స్‌టెన్షన్ బాక్స్‌కు సరికొత్త రూపమే ఈ పవర్ ట్రాక్. దీని సాయంతో 5 నుంచి 13 విద్యుత్తు ఉపకరణాల్ని ఒకేచోట ఏర్పాటు చేయవచ్చు. ఏకకాలంలో ఇన్నింటిని వాడినా షార్టుసర్క్యూట్ అవుతుందనే భయమే అక్కర్లేదు.
వంటింట్లో అయినా, ఆఫీసులో అయినా.. కరెంటు తీగల నుంచి కంప్యూటర్ వైర్ల వరకూ పవర్‌ట్రాక్‌లో బిగించొచ్చు. పవర్‌ట్రాక్ అంటే ఇదేదో కొత్త పరికరం అనుకునేరు. రెండు, మూడు ప్లగ్గులు పెట్టాల్సి వస్తే ఎక్స్‌టెన్షన్ బాక్సులు, పవర్ర్‌స్టిప్‌ల వాడకం తెలిసిందే కదా! సరిగ్గా ఇది కూడా అలాంటిదే అన్నమాట. అయితే వాటితో పోలిస్తే రెండు, మూడు రెట్లు ఎక్కువ సంఖ్యలో విద్యుత్తు ఉపకరణాలు ఏర్పాటు చేసుకునే వీలు ఇక్కడుంటుంది. ఇదే ఈ పరికరం ప్రత్యేకత.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బహుముఖ అవసరాల్ని తీర్చే పవర్‌ట్రాక్ రెండు రకాలు. గృహావసరాలకు ఉపయోగపడే కాంపాక్ట్ ట్రాక్, ఆఫీసుల్లో ఉపయోగించే డాటా ట్రాక్, పవర్‌ట్రాక్‌ను గోడకు బిగించడం వల్ల చూడటానికి చక్కటి లుక్కు వస్తుంది. వైర్ల గజిబిజి ఉండదు. పైగా పూర్తి సురక్షితం. అందుకే వీటికి గిరాకీ అధికం.
వంటగది, స్టడీరూమ్, లివింగ్‌రూమ్‌లతో పాటు ఆఫీసుల్లోనూ వీటిని విరివిగా వాడొచ్చు.
సైజును బట్టి ఒక పవర్‌ట్రాక్ ద్వారా ఐదు నుంచి పదమూడు విద్యుత్తు ఉపకరణాల్ని ఏకకాలంలో వాడుకోవచ్చు. 500 మిల్లీమీటర్లు, 600 మిల్లీ మీటర్లు, 1,300 మిల్లీమీటర్ల పొడవుతో దొరుకుతాయి. పైన అల్యూమినియం, లోపల థర్మోప్లాస్టిక్ రబ్బర్ మెటీరియల ఉపయోగించే పవర్‌ట్రాక్‌ల ధర రూ.5 వేల నుంచి రూ.7వేల వరకు ఉంది.
ఎన్నెన్నో లాభాలు..
సాకెట్లు.. ఎక్స్‌టెన్షన్ బాక్సుల్లో ఒక్కోసారి ప్లగ్గులు సరిగా దూరవు. ఫలితంగా ప్లగ్ పిన్నును పెట్టగానే సాకెట్ నుంచి చిటచిట మెరుపులు వస్తుంటాయి. ప్లగ్‌ని పైకి ఎత్తిపట్టుకుంటే కానీ మిక్సర్ తిరక్కపోవచ్చు. ఇలాంటి సమస్యలు పవర్‌ట్రాక్‌లో కన్పించవు.
ఒక్కోసారి చిన్నపిల్లలు తెలీక ప్లగ్గుల్లో చెంచాలు, ఇనుపముక్కలు, వేళ్లు పెట్టి షాక్‌కు గురవుతుంటారు. పవర్‌ట్రాక్‌తో అలాంటి భయమే అక్కర్లేదు. లోపల వేళ్లు పెట్టినా ఇబ్బందే ఉండదు. 100 శాతం షాక్‌ప్రూఫ్ ఇది.
స్విచ్‌బోర్డు అయితే సాకెట్ అమర్చిన చోటే ప్లగ్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవైపు అందకపోవడం, ఉపకరణాల్ని అటూఇటూ జరపడం వంటి ఇబ్బందులుంటాయి. ఇందులో అలాకాదు. ట్రాక్‌లో ఈ చివర నుంచి ఆ చివర వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
రకం ఏదైనా పవర్‌ట్రాక్‌తో మూడు సాకెట్లు ఉచితంగా వస్తాయి. అదనంగా కావాలంటే, వాటిని ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది.
డాటాట్రాక్‌ను గృహావసరాలకు కూడా వాడుకోవచ్చు. కాంపాక్ట్‌ట్రాక్‌ను మాత్రం ఆఫీసుల్లో వాడలేం.