
దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ ధరలే ప్రామాణికం
న్యూఢిల్లీ: బంగారం, వెండి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) నిర్వహణలోని భౌతిక బంగారం, వెండి విలువ మదింపునకు సెబీ నడుం బిగించింది. మరింత పారదర్శకతకు తోడు, స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా స్థిరత్వం కోసం కీలక ప్రతిపాదనలు చేసింది. అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు ప్రకటించే స్పాట్ ధరలను ఈటీఎఫ్‌ల నిర్వహణలోని బంగారం, వెండి విలువ మదింపునకు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తన ముసాయిదా నిబంధనల్లో సెబీ పేర్కొంది.
ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్‌లు తమ నిర్వహణలోని భౌతిక బంగారం విలువ మదింపునకు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (ఎల్‌బీఎంఏ) ధరలను అనుసరిస్తున్నాయి. ట్రాయ్ ఔన్స్ బంగారం ధర యూఎస్ డాలర్ల రూపంలో ఉంటుండగా.. మారకం రేటు ఆధారంగా బంగారం, వెండి విలువను నిర్ణయిస్తున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్‌లకు సైతం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఎల్‌బీఎంఏ స్థానంలో దేశీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లు ప్రకటించే బంగారం, వెండి ధరలను అనుసరించేలా సెబీ ప్రతిపాదించింది. స్పాట్ ధరల విషయంలోనూ పోలింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే బెంచ్‌మార్క్ ఉండేలా చూడనుంది. దీనిపై ఆగస్ట్ 6 వరకు సలహా, సూచనలను అందించాలని సెబీ కోరింది.