
దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఎస్‌బీఐ కస్టమర్‌కు మెరుగైన సేవలను అందించడంపై దృష్టి సారించింది. ఇందుకు వీలుగా బ్యాంక్ శాఖల స్థాయిలో 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించుకున్నట్టు ప్రకటించింది. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టినట్టు తెలిపింది. పరిశ్రమలోనే దీన్నొక పెద్ద నియామక ప్రక్రియగా పేర్కొంది.
ఇదీ చదవండి: జియో బ్లాక్‌రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాథమిక స్థాయి పరీక్షల అనంతరం ఏప్రిల్ నెలలో ప్రధాన పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. పారదర్శక విధానంలో చివరికి 13,455 అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మందిని బ్యాంక్ నియమించుకోనుండగా.. ఇందులో 13,500 మంది క్లరికల్ ఉద్యోగులు అని ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లు కాగా, మిగిలిన వారు స్థానిక అధికారులుగా పేర్కొన్నారు.