
క్యూ1 లాభం రూ. 21,201 కోట్లు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 21,201 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆదాయం ఇందుకు తోడ్పడింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 17,035 కోట్ల నుంచి రూ. 19,160 కోట్లకు పుంజుకుంది. రుణాల్లో 11.6 శాతం వృద్ధి సాధించినప్పటికీ నికర వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 41,072 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 0.33 శాతం నీరసించి 3.02 శాతానికి చేరాయి.
ఇతర ఆదాయం జూమ్
సమీక్షా కాలంలో ఎస్‌బీఐ వడ్డీయేతర ఆదాయం 55 శాతం జంప్‌చేసి రూ. 17,346 కోట్లకు చేరడం లాభాలకు సహకరించినట్లు శెట్టి వివరించారు. ఇందుకు 352 శాతం పెరిగిన ఫారెక్స్ ఆదాయం(రూ. 1,632 కోట్లు), పెట్టుబడుల విక్రయంపై లభించిన రూ. 6,326 కోట్లు(144 శాతం వృద్ధి) ప్రధానంగా తోడ్పడినట్లు పేర్కొన్నారు. మరోవైపు వ్యయాలను(రూ. 27,874 కోట్లు) 8 శాతానికి పరిమితం చేయడం సైతం ఇందుకు జత కలసినట్లు వెల్లడించారు.
ఈ కాలంలో తాజా స్లిప్పేజీలు రూ. 7,945 కోట్లను తాకగా.. ప్రొవిజన్లు రూ. 3,449 కోట్ల నుంచి రూ. 4,759 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) యథాతథంగా 1.83 శాతానికి చేరాయి. కనీస మూలధన నిష్పత్తి 14.63% గా నమోదైంది. అనుబంధ సంస్థలలో ఎస్‌బీఐ లైఫ్ నికర లాభం రూ. 520 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు వృద్ధి చూపగా.. ఎస్‌బీఐ కార్డ్ లాభం రూ. 594 కోట్ల నుంచి రూ. 556 కోట్లకు క్షీణించింది. జనరల్ ఇన్సూరెన్స్ నుంచి రూ. 188 కోట్లు నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు యథాతథంగా రూ. 805 వద్ద ముగిసింది.
3 శాతం మార్జిన్లపై దృష్టి...
ఈ ఏడాది మార్జిన్లు యూషేప్‌లో కదులుతున్నాయి. రెండో త్రైమాసికంలోనూ సవాళ్లకు అవకాశమున్నప్పటికీ ద్వితీయార్ధం నుంచి మెరుగుపడనున్నాయి. వార్షిక ప్రాతిపదికన పూర్తి ఏడాదికి 3 శాతం మార్జిన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిపాదనలుసహా రూ. 7 లక్షల కోట్ల రుణాలను విడుదల చేయవలసి ఉంది. రాజకీయ, భౌగోళిక అనిశ్చి తులు రుణాల విడుదలలో ఆలస్యానికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది కార్పొరేట్ రుణాల్లో 10 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. యూఎస్ టారిఫ్‌లతో ప్రభావితమయ్యే 4–5 రంగాలకు ప్రత్యక్షంగా రుణాలందించినప్పటికీ వీటి వాటా 2 శాతమేకావడంతో బ్యాంక్‌పై ప్రభావం ఉండబోదు. ఐటీ నిపుణుల ఉద్యోగాలలో కోతల ప్రభావం సైతం ఉండబోదు. అధిక శాతం రిటైల్ రుణాలు ప్రభుత్వోద్యోగులకే ఇచ్చాం.
– సీఎస్ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐ