
1:1 బోనస్ షేర్లు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 200 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం జంప్‌చేసి రూ. 2,019 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 1,371 కోట్ల టర్నోవర్ అందుకుంది.
హోటళ్ల ఇన్వెంటరీని ప్రీమియమైజ్(మెరుగైన ధరలు) చేయడంతోపాటు.. గదుల వినియోగం పుంజుకోవడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల బుకింగ్ విలువ(జీబీవీ) రూ. 7,227 కోట్లను తాకింది. గత క్యూ1లో నమోదైన రూ. 2,966 కోట్ల జీబీవీతో పోలిస్తే 144 శాతం దూసుకెళ్లింది. కాగా.. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు ఓయో వెల్లడించింది. తద్వారా అదీకృత వాటా మూలధనం రెట్టింపుకానుంది. దీంతోపాటు ఇసాప్‌లో భాగంగా 8.8 కోట్ల స్టాక్ అప్షన్స్‌కు తెరతీయనుంది. కంపెనీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే.