
ఫార్మెక్సిల్ అంచనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) మించి ఫార్మా ఎగుమతులు వృద్ధి చెందాయని ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ తెలిపింది. జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉండగా ఫార్మా ఎగుమతులు 11 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2026 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల స్థాయికి చేరతాయని ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి ధీమా వ్యక్తం చేశారు.
జనరిక్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), బయోసిమిలర్లు మొదలైనవి ఇందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమకు .. ఎగుమతులు మూలస్తంభంగా నిలుస్తున్నాయని చెప్పారు. దేశీ తయారీ సామర్థ్యాలను, ప్రపంచానికి చాటి చెబుతూ, అంతర్జాతీయ హెల్త్‌కేర్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
గ్లోబల్ జనరిక్ ఔషధ అమ్మకాల్లో 40 శాతం వాటా మనదే ఉంటోందని చెప్పారు. హెచ్‌ఐవీ, క్యాన్సర్ ఔషధాల విషయంలో అంతర్జాతీయంగా మనకు 90 శాతం పైగా వాటా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 10 శాతం పెరగ్గా, ఇందులో అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికా వాటా 25 శాతం వరకు ఉందని జోషి తెలిపారు. జనరిక్స్‌కి అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా ప్రధాన మార్కెట్లుగాను, ఏపీఐలకు చైనా, యూరప్ పెద్ద మార్కెట్లుగాను ఉంటున్నాయని చెప్పారు.