
జూన్ చివరికి రూ.2.80 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.2,80,732 కోట్లుగా నమోదైంది. తొలి త్రైమాసికం చివరికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.8 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో 4.4 శాతం మేర ద్రవ్యలోటు (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందన్నది కేంద్రం అంచనా. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరమే ద్రవ్యలోటు. జూన్ త్రైమాసికంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది.
ఇందులో రూ.5.4 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.3.73 లక్షల కోట్లు పన్నేతర మార్గంలో వచ్చింది. రుణేతర పత్రాల రూపంలో రూ.28,018 కోట్లు సమకూరింది. పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు రూ.3,26,941 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.47,439 కోట్లు పెరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ వ్యయం జూన్ క్వార్టర్‌లో రూ.12.22 లక్ష కోట్లుగా నమోదైంది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో 24.1 శాతానికి సమానం. వ్యయాల్లో రూ.3.86 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే వెళ్లింది. సబ్సిడీలపై రూ.83,554 కోట్లు ఖర్చు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే మూలధన వ్యయాలు 52 శాతం పెరిగాయి.