
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో సక్సేనా వెల్లడి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయగలమని పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో నిధు సక్సేనా పేర్కొన్నారు. ఈ ఏడాది మరోసారి నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా నిబంధన అమలుకు తెరతీయనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ వాటా తగ్గడంతోపాటు.. బ్యాంక్ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) మెరుగుపడగలదని ఫిక్కీ, ఐబీఏ నిర్వహించిన 2025 ఎఫ్‌ఐబీఏసీ సందర్భంగా తెలియజేశారు.
2026 ఆగస్ట్1కల్లా పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా కల్పించమంటూ 5 ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. సెబీ నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం పీఎస్‌యూ బ్యాంకులు వచ్చే ఆగస్ట్‌లోగా ప్రభుత్వ వాటాను తగ్గించుకోవలసి ఉంటుంది. తద్వారా పబ్లిక్‌కు కనీస వాటాను సైతం సాధించవలసి ఉంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 79.6 శాతం వాటా కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 2,000–2,500 కోట్ల సమీకరణ ద్వారా ప్రభుత్వ వాటాను 75 శాతం దిగువకు చేర్చుకోవచ్చని సక్సేనా వివరించారు. ఇప్పటికే రుణాలు, ఈక్విటీ ద్వారా రూ. 7,500 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ అనుమతి పొందినట్లు ప్రస్తావించారు. గత అక్టోబర్‌లో బ్యాంక్ క్విప్ ద్వారా రూ. 3,500 కోట్లు సమకూర్చుకుంది. దీంతో పబ్లిక్ వాటా 13.5 శాతం నుంచి 20.4 శాతానికి బలపడింది.