
రూ.61,600 కోట్లకు కంపెనీ విలువ
త్వరలో 40 శాతానికి దేశీ ఇన్వెస్టర్ల వాటా
న్యూఢిల్లీ: క్విక్‌కామర్స్ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్‌పర్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు.
త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్‌కామర్స్ విభాగంలో బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్‌స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు.
విస్తరణపై వ్యయం
తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్ షీట్‌ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.