సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల దరఖాస్తులను ఆమోదించింది. ఈ జాబితాలో ఏస్‌వెక్టర్, సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్, స్టీల్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ కంపెనీ చేరాయి. వీటిలో ఏస్‌వెక్టర్ 2025 జూలైలో గోప్యతా మార్గాన సెబీకి దరఖాస్తు చేసింది. సిల్వర్ కన్జూమర్, స్టీల్ ఇన్‌ఫ్రా ఈ ఏడాది ఆగస్ట్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2025)లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 92 కంపెనీలు మెయిన్‌బోర్డులో ఐపీవోకు వచ్చాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు ఈ నెలలోనే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో 3 కంపెనీలకు సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం! వివరాలు చూద్దాం..
స్నాప్‌డీల్
కునాల్ భల్, రోహిత్ బన్సల్ ఏర్పాటు చేసిన ఏస్‌వెక్టర్ రహస్య ఫైలింగ్ విధానంలో ఐపీవోకు అనుమతి పొందింది. ఇటీవల ఇదే మార్గంలో పలు దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూ వచి్చన సంగతి తెలిసిందే. కాగా.. ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్ మాతృ సంస్థ అయిన ఏస్‌వెక్టర్.. సాస్ ప్లాట్‌ఫామ్ యూనికామర్స్‌సహా, కన్జూమర్ బ్రాండ్ బిల్డింగ్ సంస్థ స్టెల్లారో బ్రాండ్స్‌ను నిర్వహిస్తోంది. వీటిలో యూనికామర్స్ 2024లోనే లిస్టయిన సంగతి తెలిసిందే.
పంపులు, ఫ్యాన్లు
పబ్లిక్ ఇష్యూ ద్వారా సిల్వర్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ రూ. 1,400 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 865 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 35 కోట్లు అనుబంధ సంస్థ బీఏపీఎల్ రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా పంపులు, మోటార్లు, ఫ్యాన్లు, లైటింగ్ తదితర కన్జూమర్ ఎలక్ట్రికల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది.
విస్తరణపై కన్ను
స్టీల్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 96 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.42 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వడోదర, హైదరాబాద్, భిలాయ్‌లలోగల తయారీ ప్లాంట్ల విస్తరణతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది.


